
లాలూ కుమారుడికి కోర్టు ఝలక్
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు షాక్ ఇచ్చింది. శివాన్ జర్నలిస్ట్ రాజదేవ్ రంజన్ హత్య కేసులో లాలూ కుమారుడు, బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఆయనతో పాటు ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ కు కూడా నోటీసు ఇచ్చింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది.
ఇదే కేసులో షహబుద్దీన్ అనుచరుడు షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ బుధవారం శివాన్ కోర్టులో లొంగిపోయాడు. అతడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జంట హత్యల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న షహబుద్దీన్ ఇటీవల బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు. షహబుద్దీన్ విడుదల బిహార్ లో రాజకీయంగా దుమారం రేగింది. ఆయన బయటకు రావడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు.