‘హర్‌నాథ్‌ జీ.. పద్ధతిగా మాట్లాడండి’ | Smriti Irani Asks Lawmaker To Please Be Decent | Sakshi
Sakshi News home page

‘హర్‌నాథ్‌ జీ.. పద్ధతిగా మాట్లాడండి’

Published Thu, Jul 25 2019 1:09 PM | Last Updated on Sat, Jul 27 2019 3:22 PM

Smriti Irani Asks Lawmaker To Please Be Decent - Sakshi

న్యూఢిల్లీ : పోక్సో చట్టం-2019 బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయంలో కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీకి చెందిన ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎంపీ హర్‌నాథ్‌సింగ్‌ యాదవ్‌ అభ్యంతరకరంగా మాట్లాడారు. ‘లైంగిక దాడులు ఎక్కడ జరుగుతున్నాయి.. ఈ లైంగిక నేరస్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించుకుంటే సమాధానం తేలిగ్గానే దొరుకుతుంది. మనం సమాజానికి ఏం అందిస్తున్నామో.. దాన్నే తిరిగి పొందుతున్నాం’ అన్నారు. ‘ఓసారి నా స్నేహితుడు నా వద్దకు వచ్చి పోర్నోగ్రపీ గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను పాప్‌కార్న్‌ గురించి విన్నాను. కానీ పోర్న్‌ గురించి ఎప్పుడూ వినలేద’న్నారు హర్‌నాథ్‌ సింగ్‌.

ఇక సోషల్‌ మీడియా, మీడియా ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో ఆయన ఓ ఉదాహరణ ద్వారా చెప్పారు. ‘పిల్లలకు సత్య హరిశ్చంద్రుడి సినిమా చూపిస్తే.. మంచి మనిషిగా మారడం ఎలాగో వాళ్లకి తెలుస్తుంది. కానీ ఇప్పటి పిల్లలకు ‘మున్నీ బద్నాం హూయి’, ‘చిక్నీ ఛమేలీ’ వంటి పాటలు చూపిస్తున్నాం. దీని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి సత్యహరిశ్చంద్ర, ఈ సినిమా పాటల్లో ఏవి ఎక్కువగా ప్రభావం చూపుతాయి’ అంటూ హరినాథ్‌ కాసేపు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనిపై స్పందించిన కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ ఆయనకు స్ట్రాంగ్‌ క్లాస్‌ తీసుకున్నారు. హర్‌నాథ్‌ మాట్లాడుతుండగా మధ్యలో అడ్డుకున్న స్మృతి.. సభలో మాట్లాడే పద్దతి ఇది కాదన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘హర్‌నాథ్‌ జీ.. మీరు నాకంటే వయసులో పెద్దవారు. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ఆందోళన వ్యక్తం చేయాలనకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా.. పద్ధతిగా మాట్లాడండి. ఈ సభను దేశం మొత్తం చూస్తోంది. ఇక్కడ సభలో ఎంతో మంది మహిళలు కూర్చొని ఉన్నారు. వారంతా చాలా ఇబ్బందికి గురవుతారు. మీరు మీ సమస్యను చెప్పాలనుకున్నప్పుడు పద్ధతిగా మాట్లాడండి’ అంటూ స్మృతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement