‘ఏపీలో 5 వేల అంగన్‌వాడీ పోస్టులు ఖాళీ’ | Smriti Irani Answer To Vijaya Sai Reddy Question On Anganwadi Centers | Sakshi
Sakshi News home page

ఏపీలో 5 వేల అంగన్‌వాడీ పోస్టులు ఖాళీ

Published Thu, Mar 5 2020 5:01 PM | Last Updated on Thu, Mar 5 2020 5:10 PM

Smriti Irani Answer To Vijaya Sai Reddy Question On Anganwadi Centers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో 5 వేల అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019 డిసెంబర్‌ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1665 అంగన్‌వాడీ వర్కర్లు, 3347 అంగన్‌వాడి హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదింపులు జరుపుతూ  ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల ఖాళీలను జిల్లా కలెక్టర్లు భర్తీ చేయడానికి వీలుగా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. (జేసీ ట్రావెల్స్‌ రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు)

కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్‌ 1 నుంచి అంగన్‌వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు 3 వేల నుంచి 4 వేల రూపాయలకు, హెల్పర్ల గౌరవ వేతనాన్ని నెలకు 1500 నుంచి 2250 రూపాయలకు పెంచిందిని మంత్రి తెలిపారు. అలాగే పనితీరు ప్రాతిపదికన హెల్పర్లకు ప్రోత్సాహకం కింద నెలకు 250 రూపాయలు చెల్లించడం జరుగుతోందన్నారు.  ఐసీడీఎస్‌-సీఏఎస్‌ వినియోగించే అంగన్‌వాడీ వర్కర్లకు పోషణ్‌ అభియాన్‌ ప్రోత్సాహకం కింద నెలకు 500 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే గౌరవ వేతనానికి అదనంగా అనేక రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచి అంగన్‌వాడీలకు అదనంగా ప్రోత్సాహక నగదును చెల్లిస్తున్నాయన్నారు ఇవి కాకుండా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. (అధిక బరువుతో బాధపడుతున్నారా..)

అదే విధంగా 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ  సెలవులు, పనితీరును గుర్తిస్తూ వారికి ప్రేరణ కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రూ.50 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, రాష్ట్ర స్థాయిలో 10 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే అంగన్‌వాడీలకు ఏడాదికి 400 రూపాయల విలువైన చీర కలిగిన రెండు యూనిఫారాలు, 18-50 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వర్కర్లు, హెల్పర్లకు ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన పథకం కింద జీవిత బీమా, 51 నుంచి 59 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారికి ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. తీవ్ర అనారోగ్య బారిన పడినట్లుగా గుర్తించిన అంగన్‌వాడీలకు 20 వేల రూపాయల వరకు చికిత్స ఖర్చులు, 9 నుంచి 12వ తరగతి చుదువుతున్న అంగన్‌వాడీల సంతానానికి స్కాలర్‌షిప్‌లు, సూపర్‌వైజర్ల నియామకంలో వారికి 50 శాతం రిజర్వేషన్‌ వంటి పలు సౌకర్యాలను అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి వివరించారు.(‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’)

చదవండి: ‘కడపలో బ్యాంక్‌ శాఖలను తగ్గించలేదు’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement