ముంబై : పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూను ఉరితీయడంపై బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురూను బలిపశువును చేశారని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయం ఎలా అపహాస్యమవుతుందనేందుకు ఇదే ఉదాహరణని అంటూ అఫ్జల్ గురూ అమాయాకుడైతే పోయిన అతడి ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలరని ప్రశ్నించారు. అందుకే మరణ శిక్షను అంత తేలికగా విధించరాదని, ఈ కారణంచేతే అఫ్జల్ గురూను ఎందుకు బలిపశువును చేశారనే దానిపై విచారణ చేపట్టాలని ఆమె ట్వీట్ చేశారు.
కశ్మీర్ నుంచి ఢిల్లీకి ఓ ఉగ్రవాదిని తీసుకురావాలని జమ్ము కశ్మీర్ డీజీపీ దేవీందర్ సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారని అఫ్జల్ గురూ రాసిన లేఖలో పేర్కొన్నాడని, ఆ ఉగ్రవాదే తర్వాత పార్లమెంట్‌పై దాడికి తెగబడ్డాడని అదే లేఖలో పొందుపరిచాడని రజ్దాన్ పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో డీజీపీపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదనేది నిగ్గు తేల్చాలని కోరారు. అఫ్జల్ వంటి వారు ఎలాంటి వేధింపులకు గురయ్యారు..నేరస్తుల కోసం ఉగ్ర కార్యకలాపాలు చేపట్టవలసివచ్చిందో విచారణ చేపట్టిన అనంతరమే మరణ శిక్ష విధించాలని అన్నారు. కాగా ప్రస్తుతం జమ్ము కశ్మీర్ పోలీసుల కస్టడీలో ఉన్న దేవీందర్ సింగ్‌ను ఎన్‌ఐఏ త్వరలో విచారించనుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment