ఎంపీ గారి మేకలు దొరికాయ్!
భోపాల్ : తమ తోటలోని మేకల్ని దొంగలు ఎత్తుకెళ్లారని ఓ ఎంపీ సోదరుడు ఫిర్యాదు చేయడం ఆలస్యం.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో తప్పిపోయిన మేకల్ని స్వాధీనం చేసుకుని స్వామిభక్తిని చాటుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిశాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ చౌధురీ మునవ్వర్ సలీం తోటలోని 23 మేకల్ని ఎవరో దొంగలించారు. దీంతో ఎంపీ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. చివరికి 17 మేకల్ని స్వాధీనం చేసుకున్నారు. ముర్వా గ్రామ సమీపంలోని అడవిలో ఈ మేకల్ని కనుగొన్నామని.. మూడు మేకలు కుక్కల దాడిలో చనిపోయాయని స్టేషన్ ఇన్‌చార్జ్ హెచ్‌ఎస్ రావత్ తెలిపారు. ఇంకా కనిపించని మూడుమేకల్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని మీడియాకు తెలిపారు. గ్రామస్తులు గమనించడంతో దొంగలు మేకల్ని వదిలి పరారై ఉంటారని రావత్ అన్నారు.
ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ఎంపీ పోలీసుల్ని అభినందించారు. అపహరణకు గురైన మేకలు అల్వారీ జాతికి చెందినవని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకుముందు కూడా ఎస్పీ సీనియర్ నేత, యూపీ మంత్రి అజామ్ ఖాన్‌కు చెందిన 7 గేదెలు తప్పిపోవడంతో పోలీసులు ఈ స్థాయిలోనే స్పందించారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు క్రైమ్ బ్రాంచ్, సాధరణ పోలీసులు కలిసి చివరికి ఎలాగోలా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసుల అత్యుత్సాహంపై పలు విమర్ళలు చెలరేగాయి.