- అధికార రహస్యాల చట్టాన్ని సమీక్షించే పేరుతో ఏర్పాటు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి రహస్య పత్రాలను బయటపెట్టాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నేతాజీ మనవడు సూర్యకుమార్‌బోస్ జర్మనీలో ప్రధాని మోదీని కలిసి నేతాజీ విషయంపై విజ్ఞప్తి చేసిన మరునాడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్ర హోం, న్యాయ, సిబ్బంది వ్యవహారాల శాఖల కార్యదర్శులతో కూడిన ఈ కమిటీ.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయడంలో సాధ్యాసాధ్యాలను, అధికారిక ఫైళ్లను ఎంతకాలం తర్వాత బయటపెట్టవచ్చన్న అంశాలను పరిశీలించనున్నట్లు సమాచారం.
ప్రభుత్వం మాత్రం ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టాల (ఓఎస్‌ఏ)ను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొంది. గురువారమే ఈ కమిటీ తొలి కీలక సమావేశం జరిగే అవకాశమున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నేతాజీకి సంబంధించి ఉన్న మొత్తం 90 ఫైళ్లలో 27 విదేశాంగ శాఖ అధీనంలో, మిగతావి ప్రధాని కార్యాలయం అధీనంలో ఉన్నాయని తెలిపాయి. ఈ కమిటీ ఏర్పాటుపై నేతాజీ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.