ప్రత్యేక హోదా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం: జైట్లీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం తెలిపారు. ప్రత్యేక హోదాపై లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆందోళనపై స్పందించిన జైట్లీ ఇప్పటికే ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి సాయం చేస్తున్నామని తెలిపారు.
అంతకు ముందు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విభజనతో ఏపీకి చాలా నష్టం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని, తిరుపతి, నెల్లూరు సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని మేకపాటి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.
హోదా అమలు కోసం 5 కోట్లమంది ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకపోతే చట్టసభలకు విలువేంటని మేకపాటి ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ ఎంపీల ఆందోళనపై మల్లికార్జున ఖర్గే, ములాయం సింగ్ సభలో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీల ఆందోళనపై కేంద్రప్రభుత్వం స్పందించాలన్నారు.