
పాట్నా: కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు విధించిన లాక్‌డౌన్ వల్ల పేదవాళ్లకు పస్తులు తప్పట్లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక, రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కడుపులో పరుగెడుతున్న ఎలకలను తరిమికొట్టేందుకు కప్పలను ఆహారంగా తీసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన బీహార్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది పేదలకు పూట గడవటం కష్టంగా మారింది. ఈ క్రమంలో జెహనాబాద్‌కు చెందిన కొందరు చిన్నారులు ఆకలితో అలమటించిపోయారు. ఐదు రోజులుగా తిండి దొరకపోవడంతో కప్పలను తింటూ కడుపు నింపుకుంటున్నారు. ఇందుకోసం గుంతల్లో, మురికి కాలువలో ఉన్న కప్పలను వేటాడుతూ వాటిని ఆహారంగా భుజిస్తున్నారు. (కార్మికుల కడుపుకొడుతున్న కరోనా)
ఇది చూసిన కొంతమంది ఎందుకు కప్పలను తింటున్నారని ఆ చిన్నారులను ప్రశ్నించగా అన్నం తినక ఐదు రోజులవుతుందంటూ వారి దయనీయ పరిస్థితిని వివరించారు. ఇంట్లో వండుకోడానికి ఏమీ లేవని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం సంపాదిచడం అసాధ్యమని పేర్కొన్నారు. అందుకే మరో మార్గం లేక ఇలా కప్పలను తింటున్నామని తమ విషాద గాథను చెప్తూ కంటతడి పెట్టించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో అందరి మనసులను కదిలించి వేస్తోంది. దీని గురించి సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్ నవీన్ కుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. (నేను కరోనాతో వచ్చాను, తీసుకెళ్లండి)