ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ | Ivanka Trump impressed by 15-year-old Bihar girl cycling 1500 kms | Sakshi
Sakshi News home page

ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ

Published Sun, May 24 2020 3:57 AM | Last Updated on Sun, May 24 2020 3:57 AM

Ivanka Trump impressed by 15-year-old Bihar girl cycling 1500 kms - Sakshi

వాషింగ్టన్‌ : గాయపడిన కన్నతండ్రిని కరోనా కష్ట కాలంలో సొంతూరికి చేర్చడం కోసం 15 ఏళ్ల వయసున్న జ్యోతి కుమారి అయిదు రోజులు, 1500 కి.మీ. సైకిల్‌ తొక్కడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆ అమ్మాయి చేసిన సాహసం ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ జ్యోతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె కథని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్న ఇవాంకా ‘‘అదో అందమైన సహనంతో కూడిన ప్రేమ.ఆమె చేసిన ఫీట్‌ని భారత్‌ ప్రజలతో పాటు సైక్లింగ్‌ ఫెడరేషన్‌ గుర్తించాయి‘‘అని ట్వీట్‌ చేశారు.

ఎందుకా సాహసం అంటే ..
ఎనిమిదో తరగతి చదువుతున్న జ్యోతికుమారి స్వగ్రామం బీహార్‌ లోని దర్భాంగా. ఆమె తండ్రి మోహన్‌ పాశ్వాన్‌ గత 20 ఏళ్లుగా గుర్‌గావ్‌లో ఆటో నడుపుతున్నారు. గత జనవరిలో ఆటోకు ప్రమాదం జరిగి పాశ్వాన్‌ తీవ్రంగా గాయ పడ్డారు. తండ్రిని చూసు కోవడానికి తల్లితో పాటు జ్యోతి కూడా గుర్‌గావ్‌ వచ్చింది. తల్లి అంగన్‌వాడీ వర్కర్‌ కావడంతో ఎక్కువ రోజులు గడిపే వీలులేక తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయింది. చిన్నారి జ్యోతి తండ్రి ఆలనా పాలనా చూడసాగింది. ఇంతలో ఉరుము లేని పిడుగులా కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించారు. తండ్రి ఇంకా పూర్తిగా గాయాల నుంచి కోలుకోలేదు. అద్దె ఇవ్వాలంటూ యజమానులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

దీంతో సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జ్యోతి తన సైకిల్‌పై తండ్రిని కూర్చోబెట్టుకొని ఏకంగా 1500 కి.మీ. తొక్కింది. అయిదు రోజుల పాటు అష్టకష్టాలు పడి ఎంతో శ్రమకి ఓర్చుకొని ఆ అమ్మాయి తండ్రితో పాటు సొంతింటికి చేరి ఊపిరిపీల్చుకుంది. జ్యోతి కథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది. నిర్విరామంగా ఆమె సైకిల్‌ తొక్కిన విషయం తెలుసుకున్న సైక్లింగ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎఫ్‌ఐ) ఆమెకి సైక్లింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. జ్యోతి శిక్షణలో విజయవం తమైతే నేషనల్‌ సైక్లింగ్‌ అకాడమీలో ట్రైనీగా తీసుకుంటారు. ఇప్పుడు ఇవాంకా నుంచే ప్రశంసలు రావడంతో ఆమె సాహసానికి తగిన గుర్తింపు లభించినట్టయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement