
రేపు లాంఛనాలతో అర్జన్ సింగ్ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత వాయుసేన వీరుడు మార్షల్ అర్జన్ సింగ్ భౌతిక కాయానికి రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయన గౌరవార్థం సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని తక్కువ ఎత్తులో ఎగురవేయాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అర్జన్ సింగ్ శనివారం ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అర్జన్ సింగ్ 44 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఎయిర్ ఫోర్స్‌లో 60 రకాల విమానాలను నడిపిన అనుభవం ఆయనది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా తీర్చిదిద్దడంలో అర్జన్ సింగ్ విశేషంగా కృషి చేశారు.