
‘హోదా’ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు
రాజ్యసభలో ప్రవేశ పెట్టిన కేవీపీ రామచంద్రరావు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మీరు హామీలిచ్చారు. మేం అధికారంలోకి వస్తున్నామని విభజన వల్ల నష్టపోయే ఏపీని ఆదుకుంటామని, పదేళ్ల పాటు ప్రత్యేకహోదా కల్పిస్తామని వాగ్దానం చేశారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు దాటింది. ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సత్వరమే ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ, రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ రాజ్యసభలో శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లును కేవీపీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాలను, విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఇచ్చిన హామీలను కేవీపీ ప్రస్తావించారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి చారిత్రాత్మక నేపథ్యం ఉందని, రాష్ట్ర విభజన బిల్లుపై జరిగిన చర్చలోని అంశాలను గుర్తు చేశారు.
వెంకయ్య వ్యాఖ్యల ప్రస్తావన..
సీమాంధ్ర ప్రాంతంలో 60 శాతం జనాభా ఉన్నప్పటికీ రెవెన్యూ 40 శాతమేనని, తాజా గణాంకాల ప్రకారం సీమాంధ్రకు రూ.15 వేలకోట్ల మేరకు లోటు ఉంటుందని, జీతభత్యాలకు కూడా నిధులుండవన్న వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను కేవీపీ ఉటంకించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జేట్లీ చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావించారు. పోలవరం అథారిటీని ఏర్పాటు చేయాలని, జాప్యం కాకుండా 2018 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేవీపీ డిమాండ్ చేశారు.ఏపీ నష్టాల్లో ఉందని, కొత్త రాజధాని అభివృద్ధికి ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు నిధులు సేకరించలేకపోతున్నారని, చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులను తేలేక పోతున్నారని విమర్శించారు. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లుకు మరో కాంగ్రెస్ ఎంపీ ఆనందభాస్కర్ మద్దతిచ్చారు. విభజన హామీలను నెరవేర్చాలని టీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు. బిల్లుపై చర్చ వచ్చేవారం కొనసాగనుంది.