'ప్లీజ్.. నన్ను వాడుకోవడం ఆపేయండి'
అహ్మదాబాద్: కొన్ని ముఖాలు ఎప్పటికీ మర్చిపోలేం. ఒక వేళ మర్చిపోయే పరిస్థితి వచ్చినా కొన్ని సందర్భాలు తిరిగి గత పరిచయాన్ని కళ్ల ముందుకు తెస్తాయి. ప్రస్తుతానికి కుతుబుద్దీన్ అన్సారీ పరిస్థితి కూడా అలాంటిదే. ఇప్పటికే అతడు భారతదేశం అంతటా దాదాపు అందరికీ పరిచయం అయ్యాడు. పార్టీల నిర్వాహకంతో అతడు ప్రతిసారి అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తున్నాడు. అయితే, ప్రత్యక్షంగా కాదు.. ఫొటో రూపంలో..
ఎవరు ఈ కుతుబుద్దీన్ ?
అది 2002లో గోద్రా అల్లర్లు జరుగుతున్న సందర్భం. గుజరాత్లో జరిగిన ఈ ఘోర కాండకు వెయ్యిమందికి పైగా మృత్యువాతపడ్డారు. హిందువులకు, ముస్లింలకు మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తిన సందర్భం అది. ఈ ఘటనను ప్రస్తుతానికి ఆ రాష్ట్రం, దేశం మరిచిపోయినా కుతుబుద్దీన్ను మాత్రం వెంటాడుతోంది. ఎందుకంటే గోద్రా అల్లర్లు జరుగుతున్న సమయంలో ఓ హిందువుల గుంపు అతడి ఇంటిపై దాడికి దిగింది. ఆ సమయంలో తన ఇంట్లోని ఫస్ట్ఫ్లోర్లో నిల్చున్న కుతుబుద్దీన్ హృదయం ధ్రవించేలా ఏడుస్తూ రెండు చేతులు జోడించి తనను, తన కుటుంబాన్ని రక్షించండి అంటూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు విన్నవిస్తూ కనిపించాడు. ఆ సందర్భంలో అతడి ఫోటోను ఓ మీడియా వ్యక్తి ఫొటో తీశాడు. నాటి దాడి ఘటనకు ఈ ఫొటో అద్దం పడుతోంది. అయితే ఈ ఫొటోతోనే వచ్చింది అతడికి అసలు చిక్కు.
చేదు గతాన్ని గుర్తుచేస్తున్న పార్టీలు
తన ప్రయత్నం లేకుండానే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీజేపీపై విమర్శలు గుప్పించేందుకు ఏదో ఒక పార్టీ కుతుబుద్దీన్ ఫొటోను ఉపయోగిస్తూ, ఎన్నికల ప్రచారంలో ప్రదర్శిస్తూ బీజేపీ వ్యతిరేక ఓట్లకోసం పార్టీలు ప్రయత్నించడం ప్రారంభించాయి. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అదే ఫొటోను అసోం, బెంగాల్ ఎన్నికల్లో ఉపయోగించడం ప్రారంభించింది. ఆ ఫొటోపై ఇదేనా మోదీ అభివృద్ధి అంటే? అసోంను మరో గుజరాత్లాగా కావాలని కోరుకుంటున్నారా? నిర్ణయం మీదే.. అసోంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని అందులో ఉంది.
'దయచేసి నన్ను వాడుకోకండి'
గోద్రా అల్లర్లు జరిగినప్పుడు తనకు 29 సంవత్సరాలని ఆ ఘటన తన కళ్లముందు ఇప్పటికీ కదలాడుతోందని కుతుబుద్దీన్ చెప్పారు. ఆ రోజే తాను ఒక రకంగా చనిపోయానని, కానీ, ఇప్పుడు తన పిల్లలు వేసే ప్రశ్నల కారణంగా రోజూ చస్తున్నానని చెప్పాడు. 'నాన్న ప్రతిసారి ఆ ఫొటోలో ఎందుకు ఏడుస్తూ ప్రాధేయపడుతున్నావని అడుగుతుంటే నా ప్రాణం పోయినట్లుగా ఉంటుందని, దయచేసి ఏ పార్టీ కూడా తన ఫొటో ఉపయోగించుకొని తనను బాధపెట్టవద్దని అంటున్నారు. తనకు ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకుంటున్నానని, తన మానాన తనను వదిలేయాలని పార్టీలను వేడుకుంటున్నాడు.