వీధికుక్కలు పెరిగాయని.. దారుణం!
జిల్లాలో వీధికుక్కల బెడద ఎక్కువైపోయిందంటూ కేరళ కాంగ్రెస్ (ఎం) యువజన నాయకులు చేసిన పని దారుణాతి దారుణంగా ఉంది. ఐదు కుక్కలను చంపి, వాటి కాళ్లను ఓ కర్రకు కట్టి తలకిందులుగా వాటి కళేబరాలను వేలాడదీసుకుంటూ వీధుల్లో ప్రదర్శన చేశారు. వీధుల్లో కుక్కలు బాగా పెరిగిపోయాయని, అవి కరుస్తున్న ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయని వాళ్లు అన్నారు. ప్రదర్శన తర్వాత.. వాళ్లు ఆ కళేబరాలను మునిసిపాలిటీ కార్యాలయం వెలుపల గుట్టగా పారేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.
కుక్కలను చంపింది తామేనని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుక్కల బెడద గురించి పట్టించుకోకపోతే.. భవిష్యత్తులో కూడా మరిన్ని కుక్కలను చంపుతామని నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించిన సాజీ మంజకదంబిల్ చెప్పారు. కేరళలో వీధికకుక్కలను చట్టవిరుద్ధంగా చంపబోమని ఇంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్ తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు.
అయితే.. కుక్కలను చంపడంపై ఇంతవరకు పోలీసు కేసు మాత్రం ఏదీ నమోదు కాలేదు. కేరళలో ఇటీవలి కాలంలో వీధికుక్కల మీద దాడులు పెరిగిపోయాయి. దాంతో ఇది కాస్తా రాజకీయ అంశంగా కూడా మారిపోయింది. గత నెలలో కుక్కల దాడితో 65 ఏళ్ల వృద్ధురాలు తిరువనంతపురంలో మరణించారు.