పుట్టినరోజు నాడే..
గుర్గావ్: పుట్టినరోజు వేడుక రోజే ఓ విద్యార్థికి నూరేళ్లు నిండిపోయాయి.నచ్చిన పాటలు ప్లే చేసుకునే విషయలో తలెత్తిన స్వల్ప వివాదం అతని ఉసురు తీసింది.
పోలీసు ఉన్నతాధికార హవా సింగ్ అందించిన సమాచారం ప్రకారం బీబీఏ చదుతున్న రోహిత్ తన పుట్టినరోజు సందర్భంగా గుర్గావ్, సుభాష్‌నగర్‌లోని ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా విద్యార్థులు మ్యూజిక్ ప్లే చేస్తూ, డ్యాన్సులు చేస్తూ కోలాహలంగా ఉన్నారు. ఇంతలో కొంతమంది వ్యక్తులు అక్కడికి చేరి తమకిష్టమైన పాటలు ప్లే చేసుకుంటామంటూ గొడవకు దిగారు. దీంతో వివాదం రేగింది. మాటా మాటా పెరిగి ఇక్కడ డాన్స్ చేయడానికి వీల్లేదని, అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లాలంటూ వారు ఘర్షణ పడ్డారు. అడ్డొచ్చిన రోహిత్‌పై విచక్షణరహితంగా దాడిచేశారు. ఇనుపరాడ్లు, హాకీ స్టిక్స్ తో విపరీతంగా కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనలో విద్యార్థులతో పాటు కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.