ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ విద్యార్థి నాయకుడిని కొంతమంది కాల్చి చంపారు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ విద్యార్థి నాయకుడిని కొంతమంది కాల్చి చంపారు. ఈ సంఘటన సిగ్రా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అభిషేక్ కుమార్ సింగ్ (23) మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీలో చదువుతున్న అతడిని గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్చేశారని నగర ఎస్పీ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఘాజీపూర్ జిల్లాకు చెందిన సింగ్ బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
త్వరలోనే విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండటంతో, దానికి సంబంధించి మాట్లాడుకోవాలి .. సిద్ధగిరిబాగ్ సమీపంలోని శ్మశానం వద్దకు రావాలని అతడికి ఎవరో ఫోన్ చేసి పిలిచారు. అక్కడే వాగ్వాదం పెరగడంతో అతడిని కాల్చేశారని పోలీసులు తెలిపారు. అతడు అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా.. దుండగులు వెంటపడి మరీ కాల్చారు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అతడిని బైకుపై తీసుకొస్తున్న మనోజ్ కుమార్ సింగ్ మాత్రం ఎలాగోలా తప్పించుకోగలిగాడు.