ర్యాగింగ్ పేరిట పోర్న్ మూవీలు చూపిస్తున్నారు!
భోపాల్: ర్యాగింగ్ పేరిట సీనియర్ విద్యార్థులు జూనియర్లతో బలవంతంగా పోర్నోగ్రఫీ చూపించి.. అందులోని చర్యలను అనుకరించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్న ఘటన తాజాగా భోపాల్‌లోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో వెలుగుచూసింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏంఏఎన్‌ఐటీ)లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు శనివారం జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఫిర్యాదు గురించి హెల్ప్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌కు సమాచారం అందించింది.
ఫిర్యాదు చేసిన విద్యార్థులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని తెలుస్తోంది. బీటెక్ సెంకండియర్‌కు చెందిన నలుగురు విద్యార్థులు, మూడో సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థి పేరును వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు ఐదుగురు కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. 'సీనియర్లు తమ హాస్టల్ గదులకు మమల్ని పిలిపించుకొని.. బలవంతంగా మాకు పోర్న్ మూవీలు చూపిస్తున్నారు. ఆ తర్వాత అందులో చేసినట్టు చేసి చూపించాలని ఒత్తిడి చేస్తున్నారు' అని ఫిర్యాదులో జూనియర్ విద్యార్థులు తెలిపారు.
ర్యాగింగ్ పేరిట జూనియర్లను సీనియర్లు వేధించడం చట్టబద్ధంగా నిషేధించిన సంగతి తెలిసిందే. అయినా తమను నిత్యం ర్యాగింగ్ చేయడం సీనియర్లకు అలవాటు మారిందని, వారి తీరుతో జూనియర్లు చాలా మానసికక్షోభకు గురవుతున్నారని జూనియర్ విద్యార్థి ఒకరు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు.