
లండన్ : కోవిడ్-19 ప్రభావంతో భారత్‌లో 5,80,000కు పైగా సర్జరీలు రద్దవడం లేదా జాప్యానికి గురయ్యాయని అంతర్జాతీయ కన్సార్షియం చేపట్టిన అథ్యయనం అంచనా వేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆస్పత్రి సేవలకు 12 వారాల పాటు తీవ్ర అంతరాయం నెలకొన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల సర్జరీలు రద్దవడం లేదా వాయిదా పడవచ్చని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురితమైన అథ్యయనం పేర్కొంది. దీంతో రోగులు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్జికల్ కేర్‌పై కోవిడ్-19 ప్రభావం గురించి 120 దేశాలకు చెందిన 5000 మంది సర్జన్లతో కూడిన కోవిడ్‌సర్జ్ కొలాబరేటివ్ ఈ పరిశోధనను నిర్వహించింది.
బ్రిటన్, అమెరికా, భారత్, ఇటలీ, మెక్సికో, నైజీరియా, దక్షిణాఫ్రికాకు చెందిన సభ్యుల నేతృత్వంలో ఈ అథ్యయనం సాగింది. ఆస్పత్రి సేవలకు అదనంగా ఏ ఒక్క వారం విఘాతం కలిగినా మరో 24 లక్షల సర్జరీలు వాయిదా పడటమో, రద్దవడమో జరుగుతాయని అథ్యయనం స్పష్టం చేసింది. 71 దేశాల్లోని 359 ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారంతో బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ సహా ఇతర పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు.
చదవండి : మరో సరికొత్త ఆవిష్కరణ
కోవిడ్-19 అవాంతరాలతో ప్రపంచవ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన 72.3 శాతం సర్జరీలు రద్దవుతాయని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సరేతర ఆపరేషన్లే వీటిలో అధికంగా ఉంటాయని వెల్లడించారు. ఇక భారత్‌లో కోవిడ్-19 కలకలంతో 12 వారాల సమయంలో 5,84,737మంది రోగులకు ఆపరేషన్లు వాయిదా పడ్డాయని అథ్యయనం అంచనా వేసింది. ఇక ఈ 12 వారాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 63 లక్షల ఆర్ధోపెడిక్ ఆపరేషన్లు రద్దయ్యాయని పరిశోధకులు పేర్కొన్నారు.