సాహసానికి మారుపేరు గీతా టాండన్
ముంబై: ఆమె పేరు గీతా టాండన్. ఆమెను ఎన్ని విధాలుగానైనా అభివర్ణించవచ్చు. సాహసానికి మారుపేరు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వెన్నుచూపని ధీర వనిత. జీవన పోరాటంలో అలుపెరగని ఓ తల్లి. కుల్లు సమాజం కుళ్ల బొడిచినా వ్యక్తిత్వం కోల్పోని మహిళా మణి. ప్రపంచ స్ఫూర్తిదాయక కథలకు ఆమె జీవన గమనం ఏ మాత్రం తీసిపోదు.
కెరీర్ పరంగా చెప్పాలంటే ఆమె ఓ సినిమా స్టంట్ విమెన్. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దీపికా పదుకునే, సింఘమ్‌లో కరీనా కపూర్ చేసిన సాహసాలు గీతా టాండన్ చేసినవే. హీరోయిన్లు ఎత్తైన భవనాల నుంచి దూకడం, దగ్ధమవుతున్న కారును గాజు తలుపులు బద్దలు కొడుతూ దూకించడం, పర్వతాల్లో మోటార్ బైకుపై స్టంట్ చేయడం మనం బాలివుడ్ సినిమాల్లో చూసే ఉంటాం. అవన్నీ తెరముందు కనిపించకుండా గీతా టాండన్ చేసినవే. ముఖ్యంగా ఆమె దీపికా పదుకొనేతోపాటు కత్రినా కైఫ్, బిపాసా బసు, పరిణీతి చోప్రాలకు వివిధ సినిమాల్లో స్టంట్ విమెన్‌గా చేశారు. చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి తాను జీవన పోరాటంలో చేసిన సాహసాల ముందు ఈ సాహసాలు ఓ లెక్కా అని ఆమె ఎప్పుడూ చెబుతారు. ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించిన 29 ఏళ్ల గీతా టాండన్‌కు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఆలనాపాలనా చూసుకునే వారు లేకపోవడంతో పదవ తరగతి వరకు చదివిన టాండన్‌కు దగ్గరి బంధువులు 15వ ఏటనే పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఆమె జీవితం అంధకారమైపోయింది. తాగి తందనాలాడే భర్త రోజు కొట్టే వాడు. సెక్స్ కోసం హింసించేవాడు. ఆ బాధలు భరించలేక ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి పారిపోయారు. కొన్ని రోజులపాటు గురుద్వార్‌లో తలదాచుకున్నారు. అట్లుతోమి బతుకుదామనుకున్నారు. ఓ ఇంట్లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఎంతో మంది ఆమెను వ్యభిచారం వత్తిలోకి దించేందుకు ప్రయత్నించారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు.
మసాజ్ సెంటర్‌లో జీతం ఎక్కువ ఇస్తారని మిత్రులు చెబితే అందులో చేరారు. అక్కడికెళ్లాక తెలిసింది. మసాజ్ ముసుగులో జరిగేదంతా వ్యభిచారమేనని. అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డు పక్కన రోజుకు ఎనిమిది గంటలు రొట్టెలు చేసే పనికి కుదిరారు. కాస్త జీవనం కుదుటపడింది. జీవితాన్ని మరింత మెరగుపర్చుకోవాలనుకున్నారు. పిల్లలను మంచి చదువులు చదివించాలనుకున్నారు. చిన్నప్పుడు నేర్చుకున్న డాన్స్ అనుభవంతో సినిమాలో ఎక్స్‌ట్రా డాన్సర్‌గా పని చేయాలనుకున్నారు. చివరకు స్టంట్ విమెన్‌గా సెటిల్ అయ్యారు. ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో ఆమె మీద తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.