ఇరుకునపడ్డ సుజనా చౌదరి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా చర్చ సందర్భంగా రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇరుకున పడ్డారు. ప్రత్యేక హోదా డిమాండ్ పై తన గళాన్ని గట్టిగా వినిపించలేక, తాను మంత్రిగా కొనసాగుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించలేక ఆయన ఇబ్బందికి గురయ్యారు. ప్రభుత్వం తరపునా మాట్లాడుతున్నారా, పార్టీ తరపున మాట్లాడుతున్నారా అని విపక్ష సభ్యులు ఆయనను ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే తన ప్రసంగం కొనసాగించారు.
రాజకీయ లబ్ది కోసమే ఆంధ్రప్రదేశ్ ను విభజించారని ఆయన విమర్శించారు. యూపీ అసెంబ్లీ తీర్మానం చేసినా ఆ రాష్ట్రాన్ని విభజించలేదని, ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకించినా రాష్ట్రాన్ని విభజించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న చాలా అంశాలను కేంద్రం నేరవేర్చిందని చెప్పారు. చట్టం లేకపోయినా కొన్ని అమలు చేసిందని వెల్లడించారు. విభజన చట్టంలోని అన్ని హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని సుజనా చౌదరి హామీయిచ్చారు.