'బల్లలు చరవాల్సిన అవసరం నాకులేదు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అంతా సానుకూలంగా ఉన్నారని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. శనివారం విజయవాడలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీ సీటు కావాలంటే ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లకూడదని, అలాగే ప్రత్యేక హోదా కావాలంటే ఇక్కడ బంద్‌లు చేసేకంటే ఎవరైతే దాన్ని ఇవ్వాలో అక్కడికెళ్లి చేయాలని ప్రతిపక్షాలను విమర్శించారు.
తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి హడావుడి చేసిందని ఆరోపించారు. కానీ ఈ అంశంపై ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తున్నప్పుడు 44 మంది ఎంపీలున్న ఆ పార్టీ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని నిర్మాణాత్మకంగా హోదా సాధన కోసం పనిచేయాలని సూచించారు. ఈ అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ప్రత్యేక హోదా బిల్లును లోక్‌సభకు పంపుతున్నప్పుడు రాజ్యసభలో తాను చప్పట్లు కొట్టానని వక్రీకరిస్తున్నారని, దానికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సుజనా చౌదరి అన్నారు. పార్లమెంటులో తాను నవ్వానా, నుంచున్నానా, కూర్చున్నానా అని చూడొద్దని తన చిత్తశుద్ధిని చూడాలని కోరారు.ప్రత్యేక హోదాపై తన వంతుగా కష్టపడుతున్నానని, విభజన సమయంలోనూ పోరాటం చేశానని చెప్పారు. ఆందోళనలు చేసి రోడ్లెక్కడం వల్ల సాధించేదేమీ ఉండదని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. వీటి ద్వారానే తాము రాష్ట్రానికి కొన్ని సాధించామని ఇంకా చాలా సాధించాల్సివుందన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా రావాలని, అదే సమయంలో మిగిలిన పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన ప్రాంతానికి నిధులు కూడా సాధించుకోవాలన్నారు. 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత రెవెన్యూలోటు కొంత మెరుగుపడిన మాట వాస్తవమేనని అయినా ఇంకా ఇబ్బందులున్నాయని, వాటన్నింటినీ పూర్తిగా పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదేనన్నారు. హోదాతోపాటు వీటన్నింటినీ సాధించుకునేందుకు నయానో, భయానో ప్రయత్నిస్తామన్నారు. హోదా వస్తుందనే గ్యారంటీ ఇవ్వలేనని, కానీ సాధించుకోగలననే నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ పెట్టిన ప్రైవేటు బిల్లు మనీ బిల్లని రాజ్యాంగ నిపుణులు చెప్పారని తెలిపారు.
కాగా శుక్రవారం రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెచ్చిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి చర్చ జరిగి ఓటింగ్ కోసం పట్టుబడుతుండగా పార్టీలకు అతీతంగా దానికి మద్దతివ్వాల్సిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.
ఆ బిల్లు ఆర్థిక బిల్లని దానిపై లోక్ సభోలోనే ముందుకు వెళ్లాలని అరుణ్ జైట్లీ చెప్పగానే కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఖండిస్తుండగా ఆ బిల్లుపై నిర్ణయాన్ని లోక్ సభకు స్పీకర్ కురియన్ వదిలేశారు. అది ఆర్థిక బిల్లా కాదా అనే విషయం లోక్సభ స్పీకర్ తేలుస్తారని చెప్పారు. ఇలా కురియన్ రూలింగ్ ఇవ్వగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరీ చక్కగా చప్పట్లు కొట్టేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సుజనా చేష్టలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పుబట్టిన విషయం తెలిసిందే.