సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 27న అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంపై కాంగ్రెస్ కూడా అవిశ్వాసం నోటీసు ఇచ్చిందని, అవిశ్వాసంపై ఎవరి నోటీసు చర్చకు వచ్చినా మద్దతు ఇస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 26న (సోమవారం) సమావేశం అవుతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడుకు తెలియకుండానే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని...సుజనా చౌదరి కలిశారా అంటూ ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. నాలుగేళ్లు ఎన్డీయేలో ఉండి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ఇప్పుడుకూడా టీడీపీ కేంద్రంతో లాలూచీ పడుతోందన్నారు.
‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో హోదా కోసం పోరాటం చేస్తోంది. పార్లమెంట్ లోపలా, బయటా ఎన్నో పోరాటాలు చేశాం. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు. రాజకీయ కారణౠలతోనే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లారని అమిత్ షా స్పష్టంగా చంద్రబాబుకు లేఖ రాశారు. ఐదుగురు ఎంపీలమే ఉన్నా 5కోట్ల ప్రజల ఆకాంక్షలను వినిపిస్తున్నాం. ప్రత్యేక హోదాపై టీడీపీ రోజుకో డ్రామా ఆడుతోంది. ఇప్పుడు హోదా కోసం కోర్టుకు వెళ్తామని కొత్త నాటకాలాడుతున్నారు. రాష్ట్రంలో అవినీతిపై కాగ్‌కూడా రిపోర్టు ఇచ్చింది.
అవినీతి జరగకపోతే విచారణ జరిపించాలి. అన్నిపథకాల్లో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. చంద్రబాబు దేశంలో అందరికంటే సీనియర్‌నని చెబుతూ స్కాంలు చేస్తున్నారు. టీడీపీ నాలుగేళ్ల పాలనలో స్కాంలు తప్పా, ఒక్క మంచి పథకం లేదు. హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న ఐదుగురు ఎంపీలం రాజీనామా చేస్తాం. టీడీపీ ఎంపీలు కూడా మాతో కలిసి రాజీనామా చేయాలి. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్రం స్పందిస్తుంది. ప్రత్యేక హోదా సాధించే వరకూ మా పోరాటం కొనసాగుతుంది.’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment