
సునీల్ అరోరా
బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ చీఫ్ సునీల్ అరోరా స్పష్టం చేశారు.
కోల్‌కతా: ప్రస్తుతం ఈవీఎంలను వినియోగించి జరుపుతున్న ఎన్నికల స్థానంలో బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ చీఫ్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా గతంలో పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తిరిగి బ్యాలెట్ పద్ధతిలోకి వెళ్లే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.
వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్, ఐఐఎం కలకత్తాలు శుక్ర, శనివారాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరుల సభ్యత్య కార్యక్రమం(ఎన్నార్సీ) పశ్చిమ బెంగాల్‌లో కూడా అమలు చేస్తారా అన్న ప్రశ్నకు, అస్సాంకు చెందిన ఎన్నార్సీనే ఇంకా కోర్టులో ఉందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్సు ఇచ్చే వరకు ఏమీ చెప్పలేమన్నారు. ఈవీఎంలను టాంపర్ చేసే అవకాశం ఉన్నందును బ్యాలెట్ పద్ధతిని తిరిగి ప్రవేశ పెట్టాలంటూ తృణమూల్ కాంగ్రెస్, తెలుగు దేశం, నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వంటి పార్టీల అధ్యక్షులు, నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.