న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతికి సంబంధించి పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని, అన్ని పత్రాల్ని చాలా క్షుణ్నంగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. లోయా మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభించింది.
ఈ కేసులో బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్, ముంబై ధర్మాసనాలు విచారిస్తోన్న మరో రెండు పిటిషన్లను సుప్రీంకోర్టుకు ధర్మాసనం బదిలీ చేసింది. లోయా మృతిపై ఇకపై ఎలాంటి పిటిషన్లు దాఖలైనా వాటిని విచారణకు స్వీకరించవద్దని అన్ని హైకోర్టుల్ని ఆదేశించింది. ఇంతవరకూ కోర్టుకు సమర్పించని పత్రాలను ఫిబ్రవరి 2లోగా తమ ముందుంచాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరును తెరపైకి తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీరును కోర్టు తప్పుపట్టింది.
షాపై ఆరోపణల పట్ల సాల్వే అభ్యంతరం
లోయా మృతిపై కాంగ్రెస్ నేత తెహ్‌సీన్ పూనావాల్లా, జర్నలిస్టు బీఎస్ లోనే దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కిక్కిరిసిన కోర్టు గదిలో దాదాపు గంటపాటు న్యాయవాదుల మధ్య వాడీవేడిగా వాదనలు సాగాయి. బాంబే న్యాయవాదుల విభాగం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరును ప్రస్తావించారు. షాను రక్షించే క్రమంలోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం జోక్యం చేసుకుని.. ‘ఇప్పటివరకైతే ఇది సహజ మరణమే. ఇప్పుడు ఆ విధమైన ఆరోపణలు చేయొద్దు’ అని దవేకు సూచించింది. వెంటనే దవే లేచి.. ఈ కేసులో అమిత్ షా తరఫున గతంలో సాల్వే హాజరయ్యారని, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన వాదించడం సరికాదని అన్నారు. ‘ఎవరి తరఫున ఎవరు హాజరవ్వాలనేది న్యాయవాదుల విచక్షణకే వదిలేస్తున్నాం. మేం బార్ కౌన్సిల్ కాదు.
మిమ్మల్ని మేం ఆపలేము. కేసుకు సంబంధించిన అన్ని రికార్డుల్ని సంబంధిత పార్టీలు కోర్టుకు సమర్పించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో స్వతంత్ర విచారణ జరిపించాలని లోయా తండ్రి, సోదరిలు కోరారని దవే వెల్లడించారు. ఈ కేసులో తాను ఎలాంటి విచారణ కోరడం లేదని లోయా కుమారుడి ప్రకటనకు ముందు.. అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతన్ని తన చాంబర్‌కు పిలిపించుకోవడాన్ని దవే ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వ పత్రాల్ని పిటిషనర్ల న్యాయవాదులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని సాల్వే కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
జైసింగ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
ఈ కేసులో మీడియా కవరేజీని కోర్టు అడ్డుకోవచ్చేమోనని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సందేహం వ్యక్తం చేయగా.. ఆ వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు సరికాదని.. వెంటనే వాటిని వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని సీజేఐ మిశ్రా ఆదేశించారు. దాంతో ఇందిరా జైసింగ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు.
‘ఇది చాలా అనుచితం. మీడియాను అడ్డుకునే విషయంపై కనీసం నేను ఒక్క మాటైనా మాట్లాడానా? మీడియా కవరేజీని నిరోధిస్తూ ఏదైనా ఆదేశాన్ని జారీ చేశానా?’ అని జస్టిస్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు చాలా తీవ్రమైందని, అందువల్ల విచారణ సమయంలో మీడియా నివేదికల ఆధారంగా కోర్టు వ్యవహరించదని బెంచ్ పేర్కొంది.
నిష్పాక్షిక దృష్టితో పరిశీలిస్తాం
వాదనలు ముగిశాక ధర్మాసనం స్పందిస్తూ.. లోయా మృతికి సంబంధించిన అన్ని పత్రాల్ని నిష్పాక్షిక దృష్టితో మరింత లోతుగా పరిశీలిస్తామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. సున్నితమైన సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తోన్న లోయా.. డిసెంబర్ 1, 2014న స్నేహితుడి కుమార్తె పెళ్లి కోసం నాగ్‌పూర్ వెళ్లిన సమయంలో గుండెపోటుతో మరణించారు. సోహ్రబుద్దీన్ కేసులో అమిత్‌షాతోపాటు రాజస్తాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా, గుజరాత్ పోలీసు మాజీ చీఫ్ పీసీ పాండే తదితరులు కేసు ప్రారంభ దశలో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment