
ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయమంటే రాజకీయాలా: సుప్రీం
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ నేత, మంత్రి గాయత్రి ప్రసాద్ విషయంలో పోలీసులు, రాజకీయ పార్టీలు అతి చేశాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ నేత, మంత్రి గాయత్రి ప్రసాద్ విషయంలో పోలీసులు, రాజకీయ పార్టీలు అతి చేశాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తాము ఆదేశిస్తే దానికి రాజకీయ రంగు పులిమారని, ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఎట్టిపరిస్థితుల్లో గాయత్రి ప్రసాద్ అరెస్టును ఆపబోమంటూ ఆయన తరుపు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అదే సమయంలో తాము ఎఫ్‌ఐఆర్ మాత్రమే నమోదు చేయాలని ఆదేశించినట్లు స్పష్టతనిచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదాలో ఉన్న గాయత్రి ప్రసాద్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తొలుత ఆయనపై కేసు నమోదుచేసేందుకు పోలీసులు నిరాకరించడంతో బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు కేసు నమోదుచేయగా ప్రస్తుతం ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. అటు ప్రతిపక్షాలు, అధికార పక్షం ఒకరిపై ఒకరు దాడికి దిగుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం గాయత్రి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం ఆయన అరెస్టుపై స్టేకు నిరాకరించడంతోపాటు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.