![Supreme Court Stays Madras High Court order Over Liquor Sales - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/15/supreme-court2.jpg.webp?itok=SK-jBSDI)
న్యూఢిల్లీ : మద్యం అమ్మకాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలనే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో తమిళనాడులో మద్యం అమ్మకాలకు మార్గం సుగమమైంది. కాగా, కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పున: ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం షాపుల ద్వారా అమ్మకాలు చేపట్టింది. అయితే అమ్మకాలు జరిగే షాపుల మందు పెద్ద ఎత్తున జనసముహాలు ఉండటం, వినియోగదారులు భౌతిక దూరం నిబంధన పాటించకపోవడంతో ఆ షాపులను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.(చదవండి : వారిని ఎందుకు విమర్శించరు?)
అయితే హైకోర్టు ఆదేశాలపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్, హోం డెలివరీ ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టడం సాధ్యపడదని సుప్రీం కోర్టుకు తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. చాలా రాష్ట్రాల్లో ఆన్‌లైన్ మద్యం అమ్మకాలు లేవని తెలిపింది. చట్ట ప్రకారం తగిన మార్గదర్శకాలు ఉంటేనే ఈ విధానాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మద్యం అమ్మకాలు నిలిపివేయాలనే హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. (చదవండి : లాక్‌డౌన్: మరో రెండు వారాలు పొడిగించండి)
Comments
Please login to add a commentAdd a comment