ఆస్పత్రిలో ఉన్నా.. సాయం మానలేదు
తమిళనాడుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తి తాను తిరిగి స్వదేశానికి వెళ్లడానికి అవసరమైన పత్రాల కోసం యూఏఈలో చాలా కాలంగా కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. రెండేళ్ల పాటు అతడు 20 సార్లు అలా తిరిగాడు. అతడి కష్టం విషయం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలిసింది. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో సుష్మా ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. అయినా.. తిరుచిరాపల్లికి చెందిన జగన్నాథన్ సెల్వరాజ్ అనే వ్యక్తి గురించి తెలియడంతో.. ఆమె వెంటనే అతడికి సాయం చేసి, తిరిగి సొంత గ్రామానికి రప్పించారు. ఈ విషయాన్ని సుష్మా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సెల్వరాజ్ తల్లి తమిళనాడులో మరణించినా.. ఆమె అంత్యక్రియలకు వెళ్లడానికి అతడికి అనుమతి లభించలేదు. అతడి కష్టాన్ని దుబాయ్‌కి చెందిన ఖలీజ్ టైమ్స్ పత్రిక ప్రచురించడంతో సుష్మా దృష్టికి విషయం వెళ్లింది. వెంటనే ఆమె కలగజేసుకున్నారు. భారత కాన్సులేట్‌ను సంప్రదించి అతడికి కావల్సిన పత్రాలు ఇప్పించారు.
ట్రాఫిక్, ఎండ, ఇసుక తుపాన్లు.. ఇలాంటి వాతావరణంలో తాను ట్రెక్కింగ్ చేసుకుంటూ దుబాయ్ రోడ్ల మీద వెళ్లినట్లు సెల్వరాజ్ చెప్పాడు. దుబాయ్ శివార్లలోని సోనాపూర్‌లో గల తన నివాసం నుంచి ప్రతిరోజూ 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కోర్టుకు వెళ్లేవాడినన్నాడు. దాదాపు రెండేళ్ల నుంచి అలా కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరకు సుష్మా స్వరాజ్ చొరవతో ఇంటికి చేరుకున్నాడు.