
స్ఫూర్తికి మూలం వివేకానంద: మోదీ
న్యూఢిల్లీ: స్వామి వివేకానంద 112వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ స్ఫూర్తిని అందించేందుకు స్వామి వివేకానంద మూలమని మోదీ కొనియాడారు. వివేకానంద ఆలోచనలు ఇప్పటికీ అనేకమందిపై ప్రభావం చూపిస్తున్నాయని ట్విటర్‌లో పేర్కొన్నారు.
అమెరికన్లకు మోదీ శుభాకాంక్షలు
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు నూతన శక్తితో మరింత ముందుకు వెళతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు రెండు దేశాలకే కాక.. ప్రపంచానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ నెల 6 నుంచి ఐదు మధ్య ఆసియా దేశాలతో పాటు రష్యాలో తాను పర్యటించనున్న నేపథ్యంలో.. ఆయా దేశాలతో భారత్ సంబంధాలు బలోపేతమవటానికి తన పర్యటన దోహదం చేస్తుందని మోదీ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రధానికి ముప్పులేదు: హోంశాఖ
ప్రధాని మోదీకి మతవాద తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ వచ్చిన వార్తలను కేంద్ర హోంశాఖ కొట్టిపారేసింది. ప్రధాని భద్రతకు ఎటువంటి ముప్పులేదని, దీనిపై వచ్చిన వార్తలన్నీ నిరాధారమని స్పష్టం చేసింది. ముస్లింలను ఆకర్షించేందుకు మోదీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయనకు మతవాద తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పోలీసులకు దీనిపై హెచ్చరికలు వచ్చినట్టు ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి.