ఘజియాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రమంత్రి అజామ్‌ఖాన్‌ను మంత్రివర్గం నుంచి, సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరించాలని ఆ పార్టీ నేత ములాయం సింగ్‌ను ఢిల్లీ జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుకారీ డిమాండ్ చేశారు. మతఘర్షణలు చెలరేగిన ముజఫర్‌నగర్‌ను సందర్శించడానికి వెళ్లిన బుకారీని బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బుకారీ విలేకరులతో మాట్లాడుతూ అజామ్‌ఖాన్‌ను ముస్లిం ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలకు అజామ్‌ఖానే కారణమని, అతడిని వెంటనే ఆ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
అజామ్‌ఖాన్ ఓటుబ్యాంక్ రాజకీయాలు నడుపుతున్నారని, సుమారు పదికి పైగా ప్రభుత్వ శాఖలను నిర్వహిస్తున్న అజామ్, స్థానిక ముస్లింలకు చేసింది చాలా తక్కువ అని విమర్శించారు. ఖాన్ అనుచిత ప్రవర్తన వల్లే రాష్ర్టంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీని గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు సమర్ధించారని, అయితే ఆ ప్రభుత్వం ముస్లింల అభీష్టాలను నెలవేర్చడంలో సఫలీకృతం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముజఫర్‌నగర్‌లో బాధిత కుటుంబాలను కలిసి వారికి సానుభూతి వ్యక్తం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారని బుకారీ ఆరోపించారు. కాగా, బుకారీని అడ్డుకున్న పోలీసులు అతడిని స్థానిక పీడబ్ల్యూడీ వసతిగృహానికి తరలించారు.