సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీచపు పని
పుణే: తనతో గొడవ పడుతున్న భార్యకు బుద్ధి చెప్పాలని నీచపు పనికి పాల్పడో భర్త. చేసిన అకృత్యం బయటపడి చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. తన భార్య ఫోన్ నంబరును ఎస్కార్ట్ వెబ్సైట్ లో పెట్టాడన్న ఆరోపణలతో అరుణ్ వేకర్(35) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పుణే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ కు చెందిన అరుణ్ తన భార్యతో కలిసి పుణేలోని సస్ రోడ్డులో నివాసముంటున్నాడు. రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ లో పనిచేస్తున్న తన భార్య(33)ను నిత్యం వేధించే వాడు. తన భార్య ఫోన్ నంబరు, ఇతర వివరాలు ఆమెకు తెలియకుండా ఎస్కార్ట్ వెబ్సైట్లో పెట్టాడు. కొత్త వ్యక్తుల నుంచి అభ్యంతకర ఫోన్ కాల్స్ వస్తుండడంతో అరుణ్ భార్య జూలై 22న హింజెవాది పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదంతా చేసింది అరుణ్ అని గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.
తన భార్యను వేధించేందుకే ఆమె ఫోన్ నంబరును 2 నెలల క్రితం ఎస్కార్ట్ వెబ్సైట్ లో పెట్టినట్టు ఇంటరాగేషన్ లో అరుణ్ అంగీకరించాడు. రోజూ తనతో గొడవ పడుతున్న భార్యకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశానని చెప్పాడు. అరుణ్ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.