
పట్నా: ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి.. ఇంతకు ఎవరాయనంటే.. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. కొన్ని రోజుల క్రితం విడాకులు కావాలంటూ వార్తల్లోకెక్కిన తేజ్ ప్రతాప్.. తాజాగా మంగళవారం శివుని వేషధారణలో పాట్నాలోని ఒక ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆయనకు అలాంటి వేషాలు ధరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా కృష్ణుడి వేషధారణలో, మహాభారతంలో కృష్ణుడు పోషించిన పాత్రనే తాను ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పోషించబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై, 2018 లో పాట్నాలోని ఒక శివాలయంలో ప్రార్థనలు చేయటానికి తేజ్ ప్రతాప్ శివుని రూపంలో దుస్తులు ధరించి హాజరయ్యారు. శివుని పవిత్ర నివాసాలలో ఒకటైన దేయోఘర్ బాబా బైద్యనాథ్ ధామ్ బయలుదేరే ముందు తేజ్ ప్రతాప్ ప్రార్థనలు చేశారు.