భారతదేశపు తొలి లగ్జరీ రైలు తేజస్. సోమవారం ముంబై-గోవాల మధ్య ఈ రైలును అట్టహాసంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. ఎన్నో అత్యధునిక సౌకర్యాలున్న ఈ రైల్లో ప్రయాణీకులు వీక్షించేందుకు ప్రతి సీటు వెనుక భాగంలో ఎల్‌సీడీ స్క్రీన్లు, హెడ్ ఫోన్లను అమర్చారు. అయితే, సర్వీసును ప్రారంభించిన మూడు రోజుల్లోనే ప్రయాణీకులు చేతివాటం చూపించారు.
మొత్తం రైలులో 20 బోగీలు ఉన్నాయి. వీటిలో కొన్ని బోగీల్లో ఎల్‌సీడీ స్క్రీన్లు పగలిపోయాయి. మరికొన్ని బోగీల్లో అందుబాటులో ఉంచిన హెడ్ ఫోన్లు మాయమయ్యాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్ధ కథనాన్ని ప్రచురించింది. రైలు ప్రవేశపెట్టిన మూడు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో విస్తుపోవడం రైల్వే అధికారుల వంతైంది.
ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తొలి లగ్జరీ రైలు తేజస్. అలాంటిది ప్రయాణీకులే సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తించడం సిగ్గు చేటు.