ఎన్‌డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైల్వే శాఖ మంత్రి సదానంద్ గౌడ ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్ ముంబైలోని తెలుగు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది.
సాక్షి ముంబై: ఎన్‌డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైల్వే శాఖ మంత్రి సదానంద్ గౌడ ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్ ముంబైలోని తెలుగు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం ముంబై-కాజీపేట(వరంగల్) వయా బల్లార్షా వారానికి ఒకసారి కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. దీంతో ముఖ్యంగా తెలంగాణకు చెందిన అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీంతోపాటు అహ్మద్‌బాద్-చెన్నై వయా వసాయి రోడ్డు మీదుగా వారానికి రెండు సార్లు కొత్త రైలును ప్రకటించారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం మీదుగా వెళ్లనుంది.
రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు ఈ రెండు రైళ్లు మినహా బడ్జెట్‌లో పెద్దగా ఒరిగిందేమీలేదని చెప్పవచ్చు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న తొలిసారి బడ్జెట్‌పై ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నివసించే తెలుగు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు రైల్వేబడ్జెట్‌పై నెలకొన్న ఉత్కంఠతకు మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి తెరదింపారు. నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, గుంతకల్ వైపు కొత్త రైలు లేదా కనీసం పొడగింపు తదితరాలేమైనా ఉంటాయని అందరూ భావించారు. అయితే కేవలం తెలంగాణ ప్రాంతానికి ఒక రైలు మాత్రమే ప్రకటించి తెలుగువారిని తీవ్ర నిరాశకు గురిచేశారు.
పాత డిమాండ్‌కు మోక్షం...!
బల్లార్షా లేదా కాజీపేట మీదుగా రైలును నడపాలని అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కాని ఈ మార్గం అనుకూలంగా లేకపోవడం, సెంట్రల్, సౌత్ సెంట్రల్ రైల్వేల పరిధులు తదితరాల దృష్ట్యా ఈ డిమాండ్ ఇన్నేళ్లుగా తెరపైకి రాలేదు. కాని సెంట్రల్ రైల్వేపరిధి బల్లార్షా తర్వాత చిన్న రైల్వేస్టేషన్ మానిక్‌ఘర్ వరకు ఉండగా సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధి కాగజ్‌నగర్ వరకు ఉంది. అయితే సెంట్రల్, సౌత్ సెంట్రల్‌రైల్వే పరిధిల కారణంగా ఈ బోగీని బల్లార్షా రైల్వేస్టేషన్ వరకే పరిమితం చేశారు. అదే విధంగా ముంబై-నాగపూర్ రైలును గోండియా వరకు పొడగించారు.
ప్రస్తుతం బల్లార్షా వరకు సుమారు మూడు బోగీలను సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌తో వర్దా రైల్వేస్టేషన్‌లో జోడిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ బల్లార్షా నుంచి ముంబై వెళ్లే ఈ బోగీల్లో సుమారు ఆరు టికెట్లు సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు కోటా ఉంది. అయితే ఈ బోగీలను కనీసం మంచిర్యాల వరకు పొడగించాలని లేదా మంచిర్యాల నుంచి వయా కాజీపేట మీదుగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కనీసం ఒక బోగీ జోడించాలన్న డిమాండ్లు స్థానికులు చేసేవారు. కాని మార్గాలు వేర్వేరుగా ఉండడంతో పెద్దగా ఎవరూ వీరి డిమాండ్లపై శ్రద్ధ చూపలేదు. కాని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ మార్గంపై కొత్త రైలును ప్రకటించడంతో సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కొత్తమార్గాలు...
రాష్ట్రంలో కొత్త మార్గాల సర్వేలు చేయనున్నట్టు కూడా ఈ రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. ముఖ్యంగా వీటిలో ఔరంగాబాద్-చాలిస్‌గావ్, షోలాపూర్ తుల్జాపూర్‌లున్నాయి. అదేవిధంగా డబ్లింగ్, మూడవ, నాల్గవ ట్రాక్‌ల పనులకు కూడా ప్రాధాన్యమిచ్చారు. వీటిలో కసారా-ఇగత్‌పురి, కర్జత్-లోనవాలాల మధ్య నాల్గవ ట్రాక్, భూసవల్-బడ్నేరా-వర్దా, భూసవల్-ఇటరసీల మధ్య మూడవ ట్రాక్‌ల నిర్మాణాలున్నాయి.
రాష్ర్టం మీదుగా వెళ్లే కొత్త రైళ్లు ఇవే..
జనసాధారణ్ రైళ్లు ..
ముంబై-జయంగర్
ముంబై-గోరఖ్‌పూర్
ప్రీమియం రైళ్లు:
ముంబెసైంట్రల్ - న్యూఢిల్లీ
ఏసీ రైళ్లు:
లోకమాన్యతిలక్ టెర్మినస్ (కుర్లా)-లక్నో (వీక్లీ)
నాగ పూర్-పుణే (వారానికి ఒకసారి)
పుణే-నిజాముద్దీన్ (వారానికి ఒకసారి)
నాగపూర్-అమృతసర్ (వారానికి ఒకసారి)
ఎక్స్‌ప్రెస్ రైళ్లు:
ముంబై-కాజీపేట వయా మంచిర్యాల (వీక్లీ)
ముంబై-పలితనా (వారానికి ఒకసారి)
ముంబై-బీదర్ (వీక్లీ)
కుర్లా-ముంబై)-అజమ్‌గడ్ (వీక్లీ)
బాంద్రా-జైపూర్ వయా నగ్డా, కోట (వీక్లీ)
అహ్మదాబాద్-చెన్నై వయా వసాయిరోడ్డు (వారానికి రెండు సార్లు)