
ఉగ్రవాద దాడులే హెడ్‌లైన్స్ అవుతాయి కానీ..!
ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు.. ఆ వార్తలే పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి కానీ.. వాటి నిరోధ చర్యలు అంతగా మీడియా దృష్టిని ఆకర్షించడం లేదని రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు అభిప్రాయపడ్డారు.
పనాజీ: ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు.. ఆ వార్తలే పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి కానీ.. వాటి నిరోధ చర్యలు అంతగా మీడియా దృష్టిని ఆకర్షించడం లేదని రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా మార్చేందుకు దారితీస్తున్న భావజాలం, ప్రేరేపణలు తగ్గాలని తాను ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
'వ్యక్తులను (ఉగ్రవాదులుగా) మారుస్తున్న భావజాలం, ప్రేరేపణలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. ఇందుకు మూలాలు దేశంలోనే ఉండొచ్చు. లేదా విదేశాల్లో ఉండొచ్చు. కాబట్టి ఉగ్రవాద నిరోధానికి మనం కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది' అని సురేశ్ ప్రభు అన్నారు. 'సుపరిపాలనలో జాతీయ భద్రత పాత్ర' అంశంపై గోవా రాజధాని పనాజీలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సురేశ్ ప్రభు ప్రసంగించారు. ఉగ్రవాద దాడులు జరుగానే.. అవి వార్తల్లో పతాక శీర్షికలవుతాయని, అంతేకానీ సకాలంలో చర్యలు తీసుకొని ఆ దాడులను నిరోధిస్తే.. ఆ విషయం మాత్రం ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే దేశ భద్రత సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.