
పాక్ ఉగ్రదాడుల లక్ష్యం అదే..!
హైదరాబాద్:
భారత్ పై తరచుగా దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ తీరును కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తప్పుబట్టారు. ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దాయాది పాక్ తో భారత్ ఎలాంటి శత్రుత్వాన్ని కోరుకోవడం లేదని, అదే సమయంలో పాక్ మాత్రం ఉగ్రదాడులకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పై దాయాదికి ఎలాంటి హక్కులు లేవని.. పీఓకే భారత్ లో అంతర్భాగమని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఉడీ ఉగ్రదాడిని ఈ సందర్భంగా రాందాస్ ఖండించారు. భారత్ను ఆర్థికంగా దెబ్బతీయాలన్నదే పాక్ టార్గెట్ అని అభిప్రాయపడ్డారు.
సరైన సమయం వస్తే పాక్ పై ధరల యుద్ధం చేయాల్సి వస్తుందని దాయాది దేశాన్ని హెచ్చరించారు. భారత్ ఎప్పటికీ శాంతి మార్గాన్నే అనుసరిస్తున్నా.. పాక్ మాత్రం ఉగ్రదాడులకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్ను దెబ్బకొట్టాలని పాక్ ఎప్పుడూ యత్నిస్తుందన్నారు. ఉగ్రదాడులు కేవలం పాక్ నుంచి తలెత్తుతున్నాయని, 2008లో జరిగిన ముంబై దాడులు పాక్ పనే అని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే పాక్ లక్ష్యం అని, అందుకోసం ఉద్దేశపూర్వకంగానే మన ఆర్మీ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారని రాందాస్ అథవాలే ఆరోపించారు.