పాక్‌లో అదృశ్యమైన మత గురువులు క్షేమమే
విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో అదృశ్యమైన మతగురువులిద్దరూ క్షేమంగానే ఉన్నారని, వారు సోమవారం ఢిల్లీకి చేరుకుంటారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. కరాచీలోని తన సోదరిని చూసేందుకు మేనల్లుడు సయ్యద్ నజీమ్ అలీ నిజామీతో కలసి హజ్రత్ నిజాముద్దీన్ దర్గా(ఢిల్లీ) ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ ఈ నెల 8న ఇక్కడ్నుంచి బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు.
ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో సుష్మాస్వరాజ్ ఫోన్‌లో మాట్లాడారు. వీరి ఆచూకీ కనుగొనాలని కోరారు. దీంతో కనిపించకుండా పోయిన వారిద్దరూ కరాచీలో క్షేమంగానే ఉన్నారని పాకిస్తాన్ శనివారం వెల్లడించింది. దీనిపై సుష్మాస్వరాజ్ ఆదివారం ట్వీట్ చేశారు. సయ్యద్ నజీమ్ అలీ నిజామీతో మాట్లాడానని, క్షేమంగానే ఉన్నామని ఆయన చెప్పినట్లు తెలిపారు.