ఆరు అదనపు రైలు మార్గాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: రద్దీ ఎక్కువగా ఉన్న రైలు మార్గాల్లో అదనపు లైన్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పెరిగిన ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా అవసరాలను తీర్చేందుకు ఆరు రైల్వే లైన్లు నిర్మించనుంది. రూ.10,700 కోట్ల అంచనా వ్యయంతో 908కి.మీ.ల పొడవునా నిర్మాణాలు చేపట్టనుంది. ఇందుకయ్యే వ్యయాన్ని సంస్థాగత రుణాల ద్వారా, అదనపు వనరుల ద్వారా సమీకరించనుంది.
హుబ్లీ-చికజూర్, వార్దా(సేవాగ్రాం)-బల్లార్షా, రామ్నా-సింగ్రౌలీ, అన్నుపూర్-కాట్నీ, కాట్నీ-సింగ్రౌలీ, రాంపూర్ డుమ్రా-తాల్-రాజేంద్రపూల్ మధ్య అదనపు రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనుంది. భారీ అంచనా వ్యయంతో బుధవారం ఆమోదించిన ఆరు ప్రాజెక్టుల్లో ఎక్కడా తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లే వార్దా-బల్లార్షా మార్గంలో మాత్రం రూ. 1443.32 కోట్ల అంచనా వ్యయంతో 132 కి.మీ. మూడో లైను రావడం తెలుగు రాష్ట్రాలకు ఊరట. మరోవైపు, సరుకు రవాణాను పెంచేందుకు 1100 కిలోమీటర్ల ఈస్ట్ కోస్ట్(ఖరగ్‌పూర్-విజయవాడ) కారిడార్ సహా నాలుగు కారిడార్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.