తమిళనాడులో సంక్షోభానికి ఎవరు కారణమని భావించాలి?. జయలలిత మృతి తర్వాత అధికారం కోసం పాకులాడుతోందని అన్నాడీఎంకేలోని ఓ వర్గం వ్యాఖ్యానిస్తున్న శశికళనా? లేదా ప్రతిపక్షాలైన డీఎంకే, బీజేపీల అండదండలతో ఒక్కసారిగా ప్రజలు కోరితే ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమంటూ శశికళను పన్నీరు సెల్వం వ్యతిరేకించారని చాలామంది నమ్ముతున్న మాటలనా?. తమిళనాట సంక్షోభానికి శశి, పన్నీరులు కారణం కాదు. అందుకు వేరే కారణం ఉంది. ఈ సంక్షోభానికి సగటు తమిళ ఓటరు మాత్రమే తెరదించగలడు.

ముఖ్యమంత్రి పదవి కోసం ఓ వైపు పన్నీరు సెల్వం, శశికళలు ఇద్దరూ పావులు కదుపుతుండటంతో ప్రజల మాటను వినే వారు కరువయ్యారు. ఓ జాతీయ దినపత్రికలో ప్రచురించిన వివరాల ప్రకారం కొంతమంది అన్నాడీఎంకే మద్దతుదారులు మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు వచ్చారు. జయలలిత తమ నాయకురాలిగా ఉండాలనే ఆమెను ఎన్నుకున్నామని చెప్పారు. పన్నీరు సెల్వం, శశికళలను తాము గెలిపించుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలో తమను అడగాలని ఎమ్మెల్యేలను కాదని వ్యాఖ్యానించారు.
కేవలం మూడు వాక్యాల్లో తమిళనాడును వేధిస్తున్న సమస్యను వారు చెప్పుకొచ్చారు. వారి మాటల్లో అప్రజాస్వామిక రాజకీయాలు సగటు తమిళుడిని వేధిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు పన్నీరు సెల్వం, శశికళలలో ఎవరినీ ముఖ్యమంత్రిగా అంగీకరించడం లేదనే చెప్పుకోవాలి. సినీనటిగా మంచిపేరు తెచ్చుకున్న జయ.. రాజీయాల్లో ప్రవేశించి తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్ధులను, మీడియాను ఎదుర్కొని వివాద రహితంగా ఎదిగారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత ప్రభుత్వ పాలనలో జయకు అండగా నిలిచి, ఓ వెన్నుముకగా శశికళ రాజ్యాన్ని నడిపిందనే మాటలు కూడా ఉన్నాయి.

అయితే, శశికళను తన వారసురాలిగా జయ ఎన్నడూ పేర్కొనలేదు. మరో వైపు అత్యవసర సమయాల్లో అమ్మ నుంచి పదవిని అందుకుని ఆదుకున్న పన్నీరు సెల్వానికి అంతగా ప్రజల్లో ప్రొఫైల్ లేదు. ఏళ్లుగా అత్తయ్య జయలలిత నుంచి దూరంగా ఉంటున్న మేనకోడలు దీపా జయకుమార్ తనను వారసురాలిగా ప్రకటించుకున్నా.. ఆమెను అనుభవ లేమి వెంటాడుతోంది.
- ఓ సెక్యూలరిస్టు