
అన్ని రంగాల్లో విఫలం
ప్రభుత్వంపై పార్లమెంటులో విపక్షం దాడి
► నోట్ల రద్దుపై ప్రధాని క్షమాపణకు డిమాండ్
► విపక్షాలతో గొంతు కలిపిన శివసేన
న్యూఢిల్లీ: ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విపక్షం సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దాడి చేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తెలిపే తీర్మానంపై లోక్‌సభ, రాజ్యసభల్లో జరిగిన చర్చలో నోట్ల రద్దు, సర్జికల్ దాడులు తదితరాలపై కాంగ్రె స్, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తదితర విపక్షాలు విరుచుకుపడ్డాయి. నోట్ల రద్దుతో సాధించాలనుకున్న అవినీతి నిర్మూలన వంటి లక్ష్యాలేవీ నెరవేరలేదని, అవినీతిపరులే లాభపడ్డారని పేర్కొన్నాయి. అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన కూడా వీటితో గొంతు కలిపింది. లోక్‌సభలో విపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే గంటన్నరపాటు ప్రసంగించి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.
అన్ని వర్గాల ప్రజలను సమస్యల్లోకి నెట్టిన నోట్ల రద్దుపై ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. ఆ సమయంలో ప్రధాని సభలోనే ఉన్నా రు. సభకు హాజరైన కాంగ్రెస్ చీఫ్ సోనియా.. ఖర్గే ప్రసంగిస్తున్నపుడు ఆయనకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ కనిపించారు. ఈ ఆరోపణలు నిరాధారమని ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యాయని, నోట్ల రద్దు నిర్ణయంపై దేశం మొత్తం ప్రధాని వెంట ఉందని మంత్రి మహేశ్ శర్మ అన్నారు.
రాజ్యసభలో: నోట్ల రద్దుతో సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రాజ్యసభలో కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ధ్వజమెత్తారు. ప్రణాళికా సంఘం వంటి సంస్థలను ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు.
అందుకే మోదీ పీఎం అయ్యారు: ఖర్గే
‘పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారంటే అందుకు కారణం కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడినందువల్లే. రాజ్యాంగాన్ని పరిరక్షించింది మేమే’ అని ఖర్గే పేర్కొన్నారు. తన 60 ఏళ్ల పాలనతో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, అభివృద్ధి అంతా మోదీ హయాంలోనే జరిగిందని బీజేపీ పదేపదే అనడంపై ఆయన స్పందించా రు. ఇందిర ఎమర్జెన్సీని విధిం చారని బీజేపీ సభ్యులు చెప్పగా, సోని యా వెంటనే స్పందిస్తూ.. ‘ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ ఉంది’ అని అన్నారు.