అతిపెద్ద తప్పుడు ప్రయోగం
- నోట్లరద్దు విషయంలో ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు
- పార్లమెంటు ఆవరణలో నిరసనకు 200 మంది విపక్ష ఎంపీలు హాజరు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో.. దాదాపు 200 మంది ఎంపీలు (కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం) హాజరై.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కేంద్రం నిర్ణయం ఆర్థికంగా అతిపెద్ద తప్పుడు ప్రయోగం. దీనిపై మోదీ ఆర్థిక మంత్రి సహా ఎవరినీ సంప్రదించలేదు. ఈ స్కాంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలి’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇంతపెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, ఉద్దేశపూర్వకంగానే కొందరు పారిశ్రామికవేత్తలకు లీక్ చేశారో పార్లమెంటులో చెప్పాలన్నారు. కోట్ల మంది ఇబ్బందులు ఎందుకు పడాలన్నారు. ‘పార్లమెంటుకు ప్రధాని హాజరై.. చర్చ మొత్తం విని జవాబుచెప్పాలి. దీని వెనక స్కాం ఉంది. అందుకే జేపీసీ వేయాలి’ అని విపక్షాలు డిమాండ్ చేశారుు. ప్రజాసమస్యలను పార్లమెంటులో ప్రతిబింబిస్తామని, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారుు.
దేశానికి భద్రత కరువైంది: మమత
అటు జంతర్‌మంతర్ వద్ద తృణమూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మోదీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ చేతుల్లో దేశానికి భద్రత లేదన్నారు. ‘హిట్లర్ కంటే ప్రధాని అహంభావి. స్విస్ అకౌంట్లున్నవారిని ముట్టుకోకుండా సామాన్యులను ఇబ్బంది పెడతారా?’ అని మండిపడ్డారు.ర్యాలీకి ఆప్, జేడీయూ, ఎస్పీ, ఎన్సీపీ మద్దతు ప్రకటించారుు.