
నగరం భగభగ
ఇప్పట్లో వానలు లేనట్టేనంటున్న వాతావరణ శాఖ
ఎండ ... ఈ పేరు వింటేనే నగరవాసుల గుండె దడదడలాడుతోంది. నగరంలో శుక్రవారం ఏకంగా 47.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం నుంచే వడగాలులు వీచాయి. దీంతో ఇంటి నుంచి బయటికొచ్చినవారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. మరోవైపు విద్యుత్ సరఫరాలో కోత కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సైతం ఉక్కపోతతో విలవిలలాడారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఉత్తర భారత్‌లో కొనసాగుతోన్న హీట్ వేవ్ ప్రభావంతో శుక్రవారం పాలం ప్రాంతంలో 47.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయంటున్నారు. ఈ ఉష్ణతాపం మరికొన్ని రోజులపాటు కొనసాగవచ్చని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు.
మరో వారంరోజులపాటు ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణ విభాగం అంటోంది. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ చురుగ్గా లేనందువల్ల నగరంలో ఇప్పట్ల్లో వానపడే అవకాశం లేదని చెబుతోంది. శుక్రవారం కనీస ఉష్ణోగ్రత కూడా 30 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉంది. తఉదయం నుంచే ఢిల్లీ ఎన్సీఆర్‌లో వేడిగాలులు, ఎండ తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఇళ్ల నుంచి బయటపడినవారు భానుడి తీవ్రత నుంచి తప్పించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
పాదచారులు, బస్సులతోపాటు ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు ఎం డ ధాటికి విలవిలలాడారు. పాదచారులు గొడుగుల కింద నడుస్తూ, ముఖానికి స్కార్ఫ్ చుట్టుకుని నడుస్తూ దర్శనమిచ్చారు. ఎండ తీవ్రత తమను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ తమ వ్యాపారం బాగా జరుగుతోందంటూ రహదారుల వెంబడి తాగునీరు, బేల్ షర్బత్, లస్సీ, ఐస్‌క్రీం, శీతల పానీయాల విక్రేతలు ఆనందం వ్యక్తం చేశా రు. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం మార్కె ట్లు బోసిపోయి కనిపించాయి.
ఎండవేడి తట్టుకోలేక షాపర్లు మార్కెట్లకు రావడానికి బదులు మాల్స్‌కు వెళ్లడానికి ఇష్టపడుతున్నారని దుకాణదారులు చెప్పారు. వారాంతంలో కూడా ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే సరుకు అలాగే మిగిలిపోతుందని సరోజినీనగర్ మార్కెట్ సమీపంలో రోడ్డుపక్కన దుస్తులు విక్రయించే ఓ వ్యాపారి చెప్పాడు. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు విద్యుత్ సరఫరాలో కోతతో నగరవాసులు నానాయాతనలకు గురయ్యారు.