
రూ.13 వేల కోట్ల సొత్తు చోరీ
దేశంలో వాహనాలను అపహరించే చోరుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. దేశ రాజధాని ఇందులో అగ్రభాగంలో ఉంది. మహారాష్ట్ర, గోవా లాంటి రాష్ట్రాల్లో దొంగలు చెలరేగిపోతున్నారు.
దేశ రాజధానిలోనే ఎక్కువ...
2013 నేర గణాంకాలు విడుదల
న్యూఢిల్లీ: దేశంలో వాహనాలను అపహరించే చోరుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. దేశ రాజధాని ఇందులో అగ్రభాగంలో ఉంది. మహారాష్ట్ర, గోవా లాంటి రాష్ట్రాల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. రికవరీ శాతం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో తెలిపింది. తమిళనాడు పోలీసులు ఈ విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం పైగా చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేయటం విశేషం. మిగతా దేశంతో పోలిస్తే దక్షిణ భారత దేశంలో మన రెండు రాష్ట్రాలే కాస్త మెరుగ్గా పనిచేస్తున్నాయి. గోవా మాత్రం దొంగలకు స్వర్గధామంగా మారింది. అక్కడ చోరీ జరగడమే తప్ప రికవరీ అన్న మాటే పోలీసుల డిక్షనరీలో లేకుండా పోయింది.
2013లో దేశవ్యాప్తంగా రూ.13,219 కోట్ల విలువైన సొత్తు అపహరణకు గురైంది. ఈ దశాబ్దంలో ఇంత పెద్ద మొత్తం చోరీ కావటం రెండోసారి.గతేడాది రూ.1,762 కోట్ల విలువైన వస్తువులను మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు.చోరీకి గురైన వాటిల్లో అత్యధికం వాహనాలే. ఢిల్లీలో అపహరణకు గురైన వాటిల్లో 30 శాతం వాహనాలున్నాయి. ఆధునిక మోడల్స్ రాకతో వీటి విలువ బాగా పెరిగింది.
డబ్బు, నగలు, వాహనాలపైనే దొంగలు కన్నేస్తున్నారు.మహారాష్ట్రలో ఎక్కువగా రూ.4,315 కోట్ల విలువైన చోరీలు జరిగాయి.
రూ.3,048 కోట్లతో గోవా తరువాత స్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో అత్యధికంగా 28.9 శాతం రికవరీ చేసింది 2010 సంవత్సరంలోనే.2013లో తమిళనాడు అత్యధికంగా 73.6 శాతం రికవరీ నమోదు చేసింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 51.7 శాతం రికవరీలు జరిగాయి. గతేడాది గోవాలో అత్యల్పంగా 0.1 శాతం మాత్రమే రికవరీ చేయగలిగారు.