దేశంలో దుర్వినియోగంకాని చట్టం ఉందా? | Is There Any Act That is not misused In India | Sakshi
Sakshi News home page

దేశంలో దుర్వినియోగంకాని చట్టం ఉందా?

Published Sat, Mar 24 2018 4:22 PM | Last Updated on Sat, Sep 15 2018 3:18 PM

Is There Any Act That is not misused In India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : షెడ్యూల్‌ కులాలు, తెగల వేధింపుల నిరోధక బిల్లు అమల్లోకి వచ్చిన దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టు ఈ బిల్లు దుర్వినియోగం అవుతోందని, దీన్ని సడలించాల్సిన అవసరం ఉందని భావించడం విచిత్రం. ఆ మాటకొస్తే ఈ బిల్లుపై ఎప్పటి నుంచో అలాంటి ప్రచారం ఉంది. ఇంతకు ఆ ప్రచారం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వారి ప్రచారంలో నిజముందా ? నిజంగానే చట్టం దుర్వినియోగం అవుతుందా ? అయితే ఎందుకు అవుతుంది ? ఇలాంటి అంశాలన్నింటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన బాధ్యత సుప్రీం కోర్టుది. మరి అలాంటి కోర్టే చట్టం దుర్వినియోగం అవుతుందని అభిప్రాయపడింది.

సమాజంలో వివిధ వర్గాల వేధింపుల నుంచి ఎస్సీ, ఎస్టీలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 1989లో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీల చట్టంగా పిలుస్తారు. సుప్రీం కోర్టు మాత్రం ఈ చట్టాన్ని ఈ నెల 20వ తేదీన అట్రాసిటీల చట్టంగా పేర్కొంది. ఈ చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా నిందితులను అరెస్ట్‌ చేయవచ్చనే నిబంధనను తక్షణం తొలగించాలంటూ ఆదేశించింది.

ఈ చట్టం కింద ఫిర్యాదు అందితే పోలీసులు విధిగా వారం రోజుల్లోగా ప్రాథమిక దర్యాపు జరిపి, ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని సూచించింది. ఈ చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్‌ చేయాల్సి వస్తే, వారి పై అధికారి నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవాలని కూడా సూచించింది. ఇప్పుడు ఈ సూచనలు చేసిన జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ ఏకే గోయెల్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనమే ఇంతకు ముందు వరకట్నంను నిరోధించే భారతీయ శిక్షా స్మృతిలోని 498ఏ సెక్షన్‌ కూడా దుర్వినియోగం అవుతోందని ఆరోపించింది.

అరెస్ట్‌లకు ముందే ఆరోపణలు నిజమైనవా, కావా? అన్న విషయాన్ని ఒకటి, రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని సూచించింది. అయితే, ఈ సూచనలను ఆ తర్వాత మూడు నెలలకు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని మరో బెంచీ కొట్టి వేసింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీం కోర్టు సూచించిన సవరణలను దళిత, ఆదివాసి గ్రూపులు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సమాజంలో ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా రోజు రోజుకూ దాడులు పెరుగుతుంటే ఈ సెక్షన్‌ కింద శిక్షలు మాత్రం ఎందుకు తగ్గుతున్నాయని ఆ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) కూడా ఈ విషయాన్ని రుజువు చేసున్నాయి. 2009 నుంచి 2014 వరకు ఎస్సీలపై దాడులు 40 శాతం పెరగ్గా, షెడ్యూల్డ్‌ తెగలపై 118 శాతం పెరిగాయి. 2007 నుంచి 2016 మధ్య ఈ చట్టం కింద ఎస్సీలపై జరిగిన దాడుల్లో 28.8 శాతం కేసుల్లో శిక్షలు పడగా, షెడ్యూల్‌ తెగల కేసుల్లో 25. 2 శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. అన్ని నేరాలకు సంబంధించిన మొత్తం కేసుల్లో భారతీయ శిక్షాస్మృతి కింద 42.5 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి.

ఒక్క 2016 సంవత్సరంనే ప్రమాణంగా తీసుకుంటే ఎస్సీ కేసుల్లో 25.7 శాతం కేసుల్లో, ఎస్టీ కేసుల్లో 20.8 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. అదే అన్ని నేరాలకు సంబంధించిన కేసుల్లో 46.8 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్ష పడుతున్న కేసులు జాతీయ సగటు కన్నా కొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువగాను ఉంటున్నాయి.  2016వ సంవత్సరాన్నే ప్రమాణికంగా తీసుకుంటూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీల చట్టం కింద ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. అదే కర్ణాటకలో రెండు శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి.

ఎస్సీ, ఎస్టీల చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్‌ చేసే అవకాశం ఉండటంతో అమాయకులను ఈ చట్టం కింద ఇరికించే ప్రమాదం కూడా ఉందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్రం ఆదేశాల మేరకు ఇదివరకే పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి ఈ చట్టం కింద దాఖలైన కేసుల్లో 9 నుంచి పది శాతం కేసుల్లో మాత్రమే చట్టం దుర్వినియోగం జరిగినట్లు తేల్చారు.

ఆ మాటకొస్తే అన్ని చట్టాల్లోనూ దుర్వినియోగం అవుతున్న సందర్భాలు కనిపిస్తాయి. ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందని, దాన్ని సవరించాలంటూ గతేడాది ముంబైలో దాదాపు మూడు లక్షల మందితో ర్యాలీ నిర్వహించారు మరాఠీలు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించగా ఒక్క కేసులో కూడా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని మహారాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన అధికారిక నివేదికలో స్పష్టం చేశారు.

ప్రతి చట్టం కింద తప్పుడు కేసులు నమోదవడం కొత్త విషయం ఏమీ కాదని, ఏ చట్టం అందుకు మినహాయింపు కాదని ముంబై హైకోర్టులో మానవ హక్కుల కేసులనే వాదించే న్యాయవాది మిహిర్‌ దేశాయ్‌ కూడా తెలిపారు. ఎక్కువ కేసులు దాఖలైనప్పటికీ తక్కువ కేసుల్లో శిక్షలు పడ్డాయంటే మిగతా కేసులన్నీ తప్పుగా దాఖలైన కేసులు కావని ఆయన అన్నారు.

‘ప్రొసీజర్‌ లాప్సెస్‌’, అంటే దర్యాప్తు సందర్భంగా, కోర్టు విచారణ సందర్భంగా తప్పులు జరగడం వల్ల కేసులను కొట్టి వేస్తారని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ లాంటి చట్టాలకు సంబంధించిన కేసులను ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు జరపాలని చట్టం నిర్దేశిస్తోందని, అయినా పని ఒత్తిడి కారణంగానో, మరో కారణంగానో ఈ కేసుల దర్యాప్తును దిగువ స్థాయి పోలీసులకు కూడా అప్పగిస్తున్నారని ఆయన తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో సాధారణంగా తక్కువ శిక్షలు పడడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ కేసుల్లో  నిందితులు పలుకుబడి కలిగిన వ్యక్తులు కావడం వల్ల నిందితులపై ఒత్తిడి తెచ్చి రాజీ చేసుకుంటారు. బాధితులు తాము ఎస్సీ లేదా ఎస్టీలమంటూ సరైన ఆధారాలు చూపించలేకపోతారు. కుల వివక్ష కారణంగానే తమపై దాడి జరిగిదంటూ బాధితులు నిరూపించలేకపోతారు. వారికి దర్యాప్తు అధికారుల సహకారం కూడా అంతంత మాత్రమే.

దుర్వినియోగం జరుగుతోంది కనుక మహిళలకు సంబంధించి 498ఏ సెక్షన్‌ను, ఈ ఎస్టీ, ఎస్టీల చట్టాలను కొట్టివేయాలనుకుంటే ఇంతకన్నా దుర్వినియోగం అవుతున్న చట్టాలు, సెక్షన్లు ఇంకా ఎక్కువనే ఉన్నాయి. యూఏపీఏ (అన్‌లాఫుల్‌ ఆక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌), ఢిల్లీ విఐపీ ప్రాంతాల్లో నిత్యం అమల్లో ఉండే 144వ సెక్షన్‌ అన్ని చట్టాలకన్నా ఎక్కువ దుర్వినియోగం అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement