న్యూఢిల్లీ: రాష్ట్రాలు అదనంగా తీసుకునే 2 శాతం రుణాల వినియోగంపై ఆంక్షలు లేవని కేంద్రం తెలిపింది. అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు వాడుకోవచ్చంది. ఎప్పటి మాదిరిగా 3శాతం రుణ వినియోగంపై ఆంక్షలు లేవని, అదనంగా ఉండే 2 శాతంలో ఒక శాతం పౌర కేంద్రక సంస్కరణల అమలుకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘సాధారణ పరిమితి 3 శాతంపై ఎటువంటి ఆంక్షలు లేవు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో అదనంగా పొందే 2 శాతం రుణంలో 0.50 శాతానికి ఎటువంటి నిబంధనలు లేవు.
1 శాతంలో మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఒక్కో సంస్కరణ(వన్ కార్డ్, వన్ నేషన్, స్థానిక సంస్థల బలోపేతం, విద్యుత్ రంగం వంటివి)కు 0.25 శాతం చొప్పున అదనంగా వినియోగించుకోవచ్చు. కేంద్రం సూచించిన ఏవైనా మూడు సంస్కరణలు అమలు చేస్తే మిగతా 0.50 శాతం రుణం అదనంగా వాడుకోవచ్చు’అని ఆ అధికారి వివరించారు. అదేవిధంగా, కేంద్ర పన్నుల్లో ఏప్రిల్, మే నెలలకు గాను రాష్ట్రాల వాటా కింద రూ.92,077 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఆసరాగా ఉండేందుకు 2020–21 బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు ఈ మొత్తం విడుదల చేశామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment