పాస్‌వర్డ్స్‌ ఇప్పటికీ అవేనా..? | These are the most common and easiest to hack passwords… is yours on the list? | Sakshi
Sakshi News home page

పాస్‌వర్డ్స్‌ ఇప్పటికీ అవేనా..?

Published Sun, Nov 6 2016 3:40 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

పాస్‌వర్డ్స్‌ ఇప్పటికీ అవేనా..?

పాస్‌వర్డ్స్‌ ఇప్పటికీ అవేనా..?

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఈ–మెయిల్‌ నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ దాకా, ఫేస్‌బుక్‌ నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ దాకా అనేక ఖాతాలు వినియోగిస్తుంటాం. వీటన్నిటి పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం కష్టతరమైన విషయమే! అయితే ఆన్‌లైన్‌ రూపేణా నేరాలు కొత్త రూపు సంతరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. ఇప్పటికీ చాలా మంది పాస్‌వర్డ్‌లుగా వరుస నంబర్లు, ఆల్ఫాబెట్లు, మొబైల్‌ నంబర్లు, పేర్లను వినియోగిస్తున్నారని తేలింది. ఇలాంటి సులభతరమైన పాస్‌వర్డ్స్‌ ఆన్‌లైన్‌ కేటుగాళ్ల పనిని మరింత సులువు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మీ పాస్‌వర్డ్‌ సురక్షితమేనా?
– సాక్షి, ఏపీ డెస్క్‌

లీక్‌ అయిన ‘యాహూ’ డేటాబేస్‌ను విశ్లేషించగా, ఇప్పటికీ చాలా మంది ‘123456’, ‘పాస్‌వర్డ్‌’ వంటి వాటినే పాస్‌వర్డ్‌లుగా వినియోగిస్తున్నట్లు తేలింది. ఎక్కువగా వినియోగించే వాటిలో ‘ఏబీసీ123’, ‘క్వెర్టీ' వంటివి టాప్‌–10లో ఉన్నాయని లాన్‌కాస్టర్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు వెల్లడించారు. ఇలాంటి సులభమైన వాటిని పాస్‌వర్డ్‌లుగా ఎంచుకోవడం ద్వారా తమ ఖాతాలను హ్యాకర్లు సులభంగా హ్యాక్‌ చేసే వీలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన లేకపోవడమే ఇలాంటి పాస్‌వర్డ్‌లు వినియోగించడానికి ప్రధాన కారణమని పరిశోధకులు డాక్టర్‌ జెఫ్‌ యాన్‌ తెలిపారు.

రెడ్‌ సిగ్నల్‌ మాదిరే ఇవీనూ...
‘రోడ్డుపై రెడ్‌ సిగ్నల్‌ పడితే ఏం చేయాలో అందరికీ తెలుసు. ‘123456’ లాంటి పాస్‌వర్డ్‌లు కూడా అలాంటివే. పాస్‌వర్డ్‌కు ఇవి సరైన ఎంపిక కాదు’ అని జెఫ్‌ అభిప్రాయపడ్డారు. యాహూ డేటా ప్రకారం టాప్‌–10 పాస్‌వర్డ్‌లలో వెల్‌కమ్, సన్‌షైన్, ప్రిన్సెస్‌ వంటివి ఉన్నాయి. చాలామంది తమ పేరు, పుట్టిన తేదీ, వయసు ఉపయోగించి పాస్‌వర్డ్‌లను రూపొందించుకున్నట్లు తేలింది.

అల్గారిధమ్‌తో అంచనా..
చైనాలోని లాన్‌కాస్టర్‌ యూనివర్సిటీ, పెర్కింగ్‌ అండ్‌ ఫుజియాన్‌ నార్మల్‌ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం.. పాస్‌వర్డ్‌లను అంచనా వేసే ఓ అల్గారిధమ్‌ను రూపొందించింది. వీరు ఏకంగా 73 శాతం మంది సాధారణ యూజర్ల ఖాతాలకు చెందిన పాస్‌వర్డ్‌లను దీని ద్వారా కనుగొన్నారు. ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన ఉన్న వారి ఖాతాలకు సంబంధించి సుమారు 100 ప్రయత్నాల్లో మూడొంతుల పాస్‌వర్డ్‌లను గుర్తించగలిగారు.

ఏ పాస్‌వర్డ్‌ సేఫ్‌ కాదు: హ్యాకర్‌ సర్వే
సైబర్‌ దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ–మెయిల్, సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేసి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్న ఘటనలు నిత్యం చూస్తున్నాం. బ్లాక్‌ హ్యాట్‌ 2016– హ్యాకర్‌ సర్వే నివేదిక ప్రకారం ఏ పాస్‌వర్డ్‌ కూడా సేఫ్‌ కాదని 77 శాతం మంది హ్యాకర్లు పేర్కొనడం గమనార్హం. సమాచార గోప్యతకు మద్దతునిస్తున్నట్లు 98 శాతం మంది చెప్పినప్పటికీ, ఒక వేళ డబ్బు ఇస్తే పాస్‌వర్డ్‌ హ్యాక్‌ చేసేందుకు సిద్ధమని సగం మంది పేర్కొన్నారు. ఇక సరదా కోసం హ్యాక్‌ చేస్తున్నామని 9 శాతం మంది చెప్పడం విచిత్రం!

సూచనలు..
l    పాస్‌వర్డ్‌ కనీసం 8 క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి.
l    వేర్వేరు ఖాతాలకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను వినియోగించడం మంచిది.
l    వ్యక్తిగత సమాచారం ఉపయోగించొద్దు.
l    అప్పర్‌కేస్, లోయర్‌కేస్‌ లెటర్లు, నంబర్లు, సింబల్స్‌తో కూడిన పాస్‌వర్డ్‌ రూపొందించుకుంటే మంచిది.
l    పాస్‌వర్డ్‌ మేనేజర్‌ వాడడం ఉపయుక్తం

టాప్‌–10 వరస్ట్‌ పాస్‌వర్డ్స్‌
1. 123456
2. పాస్‌వర్డ్‌
3. వెల్‌కమ్‌
4. నిన్‌జా
5. ఏబీసీ123
6. 123456789
7. 12345678
8. సన్‌షైన్‌
9. ప్రిన్సెస్‌
10. క్వెర్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement