పశ్చిమ బెంగాల్: ప్రత్యర్ధి పార్టీ నాయకులను పోలింగ్ బూతుల నుంచి బయటకు లాగి చితక్కొట్టాలని కార్యకర్తలకు ఫోన్ ద్వారా చెప్తూ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధి సోనాలి గుహా చిక్కుల్లో పడ్డారు. సత్గాచియా ప్రాంతంలోని పోలింగ్ బూతులో ఈవీఎం సరిగా పనిచేయడం లేదంటూ ఆమె ఈసీకి చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదు.
దీంతో పోలింగ్ బూతులోకి ఆమె వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డగించడంతో ఇరువురి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. మమత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన సోనాలీ.. సీపీఎం వాళ్ల వల్లే ఈవీఎం పగిలిపోయిందని, వాళ్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు ఈడ్చి తరిమికొట్టాలని ఫోన్ లో కార్యకర్తలకు చెప్పారు. ఓటర్లందరూ తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనాలి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసింది. సోనాలిపై కేసు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.