బెదిరిస్తే పని జరగదు: వెంకయ్య
బంగ్లాను ఖాళీ చేయకుండా.. పైపెచ్చు బెదిరిస్తే పనులు జరగవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఆరెల్డీ నేత అజిత్ సింగ్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా ఉండగా ప్రభుత్వం తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయకుండా ఒత్తిడి తెస్తున్నారంటూ అజిత్ సింగ్ మీద ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అలాంటి బెదిరింపుల వల్ల పనులేమీ జరగవని వెంకయ్యనాయుడు విలేకరుల వద్ద అన్నారు. అజిత్ సింగ్ మీద రాజకీయ కక్ష తీర్చుకోవడం అంటూ ఏమీ లేదని చెప్పారు. అజిత్ సింగ్ ఉంటున్న బంగ్లాను చౌదరి చరణ్ సింగ్ స్మారక కేంద్రంగా ప్రకటించాలని ఆరెల్డీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై గురువారం జరిగిన ఘర్షణలలో దాదాపు 200 మంది రైతులు, కొందరు పోలీసులు గాయపడ్డారు. తుగ్లక్ రోడ్డులోని ఈ బంగ్లాకు నీరు, విద్యుత్ సరఫరా కట్ చేయడంపై వారు నిరసన వ్యక్తం చేశారు.