
మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలతో సహా తెలంగాణలోని పాలేరు ఉప ఎన్నికకు సోమవారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. తమిళనాడులో 232 స్థానాలకు, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చెన్నైలో పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో డీఎంకే చీఫ్ కరుణానిధి, సినీ ప్రముఖులు కమల్ హాసన్, అజిత్ కుమార్, ఖుష్బూ తదితరులు ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి జయలలిత స్టెల్లామేరీ కాలేజీలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
తమిళనాడులో 232 అసెంబ్లీ స్థానాల్లో 3,776 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 5,82,59,801 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 65వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. అరవకురిచి, తంజావూరు స్థానాల్లో అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అక్కడ ఎన్నికలను ఈసీ మే 23కు వాయిదా వేసింది. మే 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
కేరళలో 140 స్థానాలకు 1,203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2,61,06,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 109 మంది మహిళ అభ్యర్ధులు పోటీపడుతున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాల్లో 344 అభ్యర్థులు పోటీపడుతున్నారు. 9,41,935 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేరళలో మాజీ సీఎం ఏకే ఆంటోనీ, సినీనటుడు, ఎంపీ సురేష్ గోపీ తదితరులు ఓటు వేశారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 243 పోలింగ్ కేంద్రాల్లో 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలు మే 19 గురువారం వెలువడనున్నాయి.