కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్  | TikTok Star Who Ridiculed Covid-19 Threat Tests Positive in MP | Sakshi
Sakshi News home page

కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ 

Published Sat, Apr 11 2020 4:27 PM | Last Updated on Sat, Apr 11 2020 4:41 PM

 TikTok Star Who Ridiculed Covid-19 Threat Tests Positive in MP - Sakshi

ఫైల్ ఫోటో

భోపాల్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశ ప్రజలంతా లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంటే..మధ్యప్రదేశ్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్ ఒకరు నిర్లక్ష్యంగా ప్రవర్తించి, చివరకు మహమ్మారి కోరలకు చిక్కాడు. మాస్క్ లను ధరించడాన్ని ఎగతాళి చేశాడు. మాస్క్ లను కాదు దేవుడ్నినమ్ముకోండి అంటూ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలికాడు. ప్రస్తుతం అతగాడు ఇపుడిక దేవుడే దిక్కు  అంటూ ఆసుపత్రి బెడ్ మీదకు చేరాడు. తన చుట్టుపక్కల వారిని  కూడా ప్రమాదంలోకి నెట్టేశాడు. కరోనా  పాజిటివ్  వచ్చిన  తర్వాత  కూడా నాకోసం ప్రార్థించండి అంటూ మరో రెండు వీడియోలను అప్‌లోడ్ చేశాడు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

కోవిడ్-19 నుండి రక్షణ కోసం ముసుగులు ఉపయోగించడాన్ని ఎగతాళి చేసిన 25 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది. జబల్పూర్ లోని తన సోదరి ఇంటికి వెళ్లిన  తరువాత  ఈ యువకుడికి కరోనా లక్షణాలు కల్పించడంతో పరీక్షలు  నిర్వహించారు. చివరికి పాజిటివ్ అని తేలడంతో బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి పాలైన తరువాత కూడా వార్డు నుండే వీడియోలను అప్‌లోడ్ చేశాడు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ తన అనుచరులను కోరాడు. కరోనా వైరస్ కారణంగా టిక్‌టాక్ వీడియోలను అప్‌లోడ్ చేయలేను. దయచేసి మద్దతుగా నిలవండి..నా కోసం ప్రార్థించండి అంటూ వీడియోల్లో వేడుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసు అధికారులు ఎట్టకేలకు శుక్రవారం అతని ఫోన్‌ను లాక్కున్నారు. అంతేకాదు అతని బాధ్యతా రాహిత్యానికిగాను వైద్య సిబ్బంది, కుటుంబం, పొరుగువారితో సహా 50 మంది నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. కాగా సాగర్ జిల్లాలో ప్రాణాంతక వైరస్ వచ్చిన మొదటి కేసు ఇదే కావడంతో  కలెక్టర్ ప్రీతి మైథిల్ ప్రజలను భయపడవద్దని కోరుతూ ఒక సందేశాన్ని  విడుదల చేశారు. ఆందోళన అవసరం లేదని రోగి ఆరోగ్యపరిస్థితి స్థిరంగా ఉందని  ప్రకటించారు.

చదవండి : రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement