
నేడు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రసంగించనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రాథమ్యాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు. ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టి దేశ సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయడం, ద్రవ్యోల్బణాన్ని, ధరలను అదుపులో పెట్టడం, ద్రవ్యలోటును కట్టడి చేయడం, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయడం, విదేశీ నిధులను ఆకర్షించడం..
మొదలైనవి మోడీ సర్కారు ప్రాధాన్యతాంశాలుగా రాష్ట్రపతి ప్రసంగంలో చోటు చేసుకునే అవకాశముంది. అనంతరం లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళ, బుధవారాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ జరుగుతుంది.