భారత్‌ @ 158 | Total 158 Coronavirus Cases In India | Sakshi
Sakshi News home page

భారత్‌ @ 158

Published Thu, Mar 19 2020 4:10 AM | Last Updated on Thu, Mar 19 2020 5:12 AM

Total 158 Coronavirus Cases In India - Sakshi

షిర్డీ సాయిబాబా గర్భగుడి మూసేయడంతో బయట నుంచి దర్శనం చేసుకుంటున్న భక్తులు

న్యూఢిల్లీ/బెంగళూరు: భారత్‌లో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య బుధవారానికి 158కి చేరింది. మంగళవారం నుంచి కొత్తగా 14 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వారిలో ఒక సైనికుడు కూడా ఉన్నారు. లద్దాఖ్‌ స్కౌట్‌ రెజిమెంట్‌కు చెందిన 34 ఏళ్ల సైనికుడికి కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని భారత సైన్యం ప్రకటించింది. ఇరాన్‌ నుంచి ఫిబ్రవరి 20న ఎయిర్‌ ఇండియా విమానంలో భారత్‌ తిరిగొచ్చిన తన తండ్రి నుంచి ఆ సైనికుడికి ఆ వైరస్‌ సోకిందని, అతడి తండ్రికి కూడా కోవిడ్‌ నిర్ధారణ అయిందని వెల్లడించింది.

వారు లేహ్‌లోని చౌహత్‌ గ్రామానికి చెందినవారని తెలిపింది. ఆ సైనికుడి సోదరుడికి కూడా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశగా ఆర్మీ చర్యలు ప్రారంభించింది. సెలవుపై వెళ్లి వచ్చిన సైనికులకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరపడం, ఫ్లూ లక్షణాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, అనవసర ప్రయాణాలను, అన్ని శిక్షణ కార్యక్రమాలను, సదస్సులను రద్దు చేయడం.. తదితర చర్యలు చేపట్టింది. ఈ వైరస్‌ సోకిన 158 మందిలో ముగ్గురు మృతులు, 25 మంది విదేశీయులు ఉన్నారు.

ఏకాంతవాస కేంద్రాల(క్వారంటైన్‌ సెంటర్స్‌)ను సందర్శించి, అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ బాధితులతో సన్నిహితంగా ఉన్న దాదాపు 5700 మందిని వివిధ క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బుధవారం వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 42, కేరళలో 27, ఉత్తరప్రదేశ్‌లో 16, కర్ణాటకలో 11, ఢిల్లీలో 10, లద్దాఖ్‌లో 8, తెలంగాణలో 13 కేసులు నమోదయ్యాయి. హరియాణాలో కోవిడ్‌ బారిన పడిన 17 మందిలో 14 మంది విదేశీయులే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా చికిత్స అనంతరం కోలుకుని 14 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇటీవల సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన బీజేపీ ఎంపీ సురేశ్‌ ప్రభు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు.

విదేశాల్లోని భారతీయులకు..
విదేశాల్లోని భారతీయుల్లో 276 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్‌ బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. వారిలో ఇరాన్‌లోని 255 మంది, యూఏఈలోని 12 మంది, ఇటలీలోని ఐదుగురు, శ్రీలంక, కువైట్, రువాండా, హాంకాంగ్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారన్నారు. యూఏఈలో 8 మంది భారతీయులను క్వారంటైన్‌ చేసినట్లు వెల్లడించారు. ఇరాన్‌లో సుమారు 6 వేల మంది భారతీయులున్నారన్నారు. వారిలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్రల నుంచి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లిన 1100 మంది, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన 1000 మంది మత్స్యకారులు, జమ్మూకశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల నుంచి వెళ్లిన 300 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు ఇరాన్‌ నుంచి 389 మందిని వెనక్కు తీసుకువచ్చామన్నారు.

రాజ్యసభలో మాస్కుల కలకలం
రాజ్యసభకు తొలిసారి ఎంపీ డెరెక్‌ ఓ బ్రేన్‌ సహా నలుగురు టీఎంసీ సభ్యులు మాస్క్‌లతో వచ్చారు. సభా నిబంధనల ప్రకారం సభ్యులు మాస్క్‌లు ఉపయోగించరాదని సభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కరోనా ముప్పు నేపథ్యంలో మాస్క్‌ల వినియోగం తప్పనిసరి అని, దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసిందని, అందువల్ల మాస్క్‌లను అనుమతించాలని కాంగ్రెస్‌ సభ్యుడు చిదంబరం కోరడంతో, వెంకయ్యనాయుడు అంగీకరించారు. కరోనా ముప్పు పొంచి ఉందని, అందువల్ల బడ్జెట్‌ సమావేశాలను కుదించాలని కాంగ్రెస్‌ సహా పలు పార్టీల సభ్యులు అభ్యర్థించారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ ఉంటామని, అందువల్ల ఎంపీలకు వైరస్‌ ముప్పు అధికంగా ఉంటుందని, ఎంపీలమైనందువల్ల ఆ వైరస్‌ మన జోలికి రాదని అనుకోకూడదని కాంగ్రెస్‌ సభ్యుడు రాజీవ్‌ గౌడ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అభ్యర్థనను ప్రభుత్వం తోసిపుచ్చింది.

సబ్బుల ధరలపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతున్న నిత్యావసరాలైన సబ్బులు, నేలలు తుడిచే క్లీనర్లు, థర్మల్‌ స్కానర్ల ధరలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. సాధారణంగా ఈ శాఖ దేశవ్యాప్తంగా 22 నిత్యావసరాల ధరలను పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా ఫేస్‌ మాస్క్‌లు, చేతి శానిటైజర్లను ఆ జాబితాలో చేర్చింది. ‘కోవిడ్‌ కారణంగా డిమాండ్‌ పెరిగిన సబ్బులు, లైజాల్, డెటాల్‌ వంటి చేతులు, నేలలు శుభ్రపరిచే క్లీనర్ల ధరలను మేం పర్యవేక్షిస్తున్నాం’అని కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 114 కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల ధరలను కేంద్రం పర్యవేక్షిస్తోంది. 22 నిత్యావసర వస్తువుల్లో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, నూనెలు, కూరగాయలు, చక్కెర, పాలు, టీ, ఉప్పు తదితరాలు ఉన్నాయి. కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెరగడంతో వేరే దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువగా వ్యాపిస్తోందని ఆయన పేర్కొన్నారు.  

ఐఐటీ బాంబే బంద్‌
► కరోనా ముప్పు నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదని బీజేపీ నిర్ణయించింది.
► మా పరుపులు వాడితే కరోనా వైరస్‌ రాదని ప్రచారం చేస్తున్న ఒక వ్యాపారిపై మహారాష్ట్రలోని థానేలో కేసు నమోదైంది.
► కోవిడ్‌–19 లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించి, వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లాలని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై నకిలీ వార్తలు ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.  
► కరోనా వైరస్‌ నుంచి రక్షిస్తుందని పేర్కొంటూ గో మూత్రాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని నారాయణ చటర్జీ అనే బీజేపీ కార్యకర్త కోల్‌కతాలో మంగళవారం నిర్వహించారు. ఆ గోమూత్రం సేవించి, అనారోగ్యం పాలయిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చటర్జీని అరెస్ట్‌ చేశారు.
► ఐఐటీ బాంబే క్యాంపస్‌ను మార్చి 31 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  
► లండన్‌లో వేలాదిగా ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై అక్కడి హైకమిషన్‌ను అభ్యర్థిస్తున్నారు. అయితే, బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై మార్చి 31 వరకు భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో కోవిడ్‌ కారణంగా 104 మంది చనిపోగా, దాదాపు 2 వేల మందికి ఈ వైరస్‌ సోకింది.
► పారా మిలటరీ సిబ్బందికి సంబంధించిన అన్ని అత్యవసరం కాని సెలవులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.



పార్లమెంట్‌ వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యకు థర్మల్‌ స్క్రీనింగ్‌ దృశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement